ఉవ్వెత్తున కదలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం జాతరను తలపించించి. చేతిలో గులాబీ జెండా, మెడలో కండువాతో సభకు హాజరైన యువత ‘కొత్త’ ఊపును తీసుకొచ్చింది. వాహనాలన్నీ సభా ప్రాంగణం వైపు పరుగులు పెట్టడంతో రెట్టించిన ఉత్సాహం నింపింది. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ‘జై బీఆర్ఎస్.. జై జై కేసీఆర్.. జయహో తెలంగాణ..’ అంటూ నియోజకవర్గ ప్రజానీకం కదం తొక్కారు. సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కొనసాగినంతసేపు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆసక్తిగా విన్నారు. సంబురంతో నినాదాలు చేసి జోష్ నింపించారు. మంచి వ్యక్తిత్వం ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.