కార్యదక్షుడు.. దార్శనికుడు.. మడమతిప్పని యోధుడు.. వెన్నుచూపని ధీరుడు.. ప్రగతికి మార్గదర్శకుడు.. అభివృద్ధి నిర్దేశకుడు.. సబ్బండవర్గాలకు దేవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు అందరికీ పండుగరోజు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకొన్నారు. పలు చోట్ల కేక్‌లు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల మొక్కలు నాటారు. అనాథలు, వృద్ధులకు అన్న, వస్త్రదానాలు చేశారు. సత్తుపల్లిలో రహదారిపై వేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల చిత్రరూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేక్ కట్ చేశారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం వివిధ డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని ప్రజలు కోరుతున్నారన్నారు.
ఖమ్మం, ఫిబ్రవరి17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యమ సారథి, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటాయి.. టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు ఊరూరా సంబురాలు నిర్వహించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేశారు. రఘునాథపాలెంలోని బృహత్ ప్రకృతి వనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌తో కలిసి కేక్ కట్ చేశారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నాయకులు వేడుకలు నిర్వహించారు. సత్తుపల్లిలో శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కిష్టారంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములునాయక్ రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కారేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ నాయకులతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూసుమంచిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మధిరలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు నాయకులతో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.
భద్రాద్రి జిల్లాలోని మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతరావు ఆధ్వర్యంలో నాయకులు వేడుకలు నిర్వహించారు. అర్బన్ ఫారెస్ట్‌లో అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అశ్వరావుపేటలో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావు అంగన్వాడీ టీచర్లకు చీరెలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. కొత్తగూడెంలోని హరిత హోటల్ ఆవరణలో మేడారం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాతో కలిసి కేక్‌ను కట్ చేశారు. ఇల్లెందు జగదాంబ సెంటర్లో శాసనసభ్యురాలు హరిప్రియానాయక్ వేడుకలు నిర్వహించారు. భద్రాచలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు వేడుకలు నిర్వహించారు.