శ్రీరాంపూర్, జూన్ 9: సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి.. కార్మికుల కష్టంతో అభివృద్ధి చెందుతూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం నస్పూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 134 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న సింగరేణిని సర్వనాశనం చేయాలని బీజేపీ కుట్రపన్నుతున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు, ఆంధ్రా నాయకులు సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి ఇచ్చారని ఆరోపించారు. 2014కు ముందు కార్మికులకు ఉన్న 18 శాతం లాభాల వాటాతో కేవలం రూ .56 కోట్లు తీసుకునే వారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ. 11 వేల కోట్ల టర్నోవర్‌లో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రూ. 33 వేల కోట్లకు చేరిందని చెప్పారు. గతంలో కార్మికులకు లాభాల్లో వాటా కేవలం రూ.3 00 కోట్లు మాత్రమే వచ్చేవని గుర్తు చేశారు. ఈ ఏడాది కార్మికులు సుమారు రూ. 700 కోట్లు తీసుకోనున్నారని స్పష్టం చేశారు.
కార్మికులు కష్టపడి కాపాడుకుంటున్న సింగరేణిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసి నాశనం చేస్తామంటే ఉరుకుందామా అని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామని, కార్మికులు ఎంతో కష్టపడి లాభాల్లోకి తెచ్చుకున్నారని చెప్పారు. స్వరాష్ట్రంలో సింగరేణిలో 19,468 ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. ఇందులో 1525 కారుణ్య ఉద్యోగాలిచ్చామని చెప్పారు. గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ప్రమాద భృతి రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగానికి బదులు రూ. 25 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. కార్మికులకు వడ్డీ లేని 10 లక్షల గృహ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారికి ఇప్పటి వరకు 22వేల మందికి 76 జీవో ప్రకారం పట్టాలు అందించామని తెలిపారు. ఇటీవలే బెల్లంపల్లిలో 7500, శ్రీరాంపూర్‌లో 3200 కుటుంబాలకు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. మిగిలిన వారికి కూడా దశాబ్ది ఉత్సవాల్లోగా ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సింగరేణిని ప్రైవేటోళ్లకు ఇచ్చి తాళం వేస్తామంటే ఊరకునేది లేదని స్పష్టం చేశారు. దేశంలో బొగ్గు కొరత లేదన్నారు. ఈస్ట్, వెస్ట్, దేశంలో 351 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నిజాం ప్రభుత్వం బొగ్గు నిల్వలు కనిపెట్టి ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. సింగరేణి గనులపై కుట్రలు చేస్తున్న బీజేపీకి కార్మికులు బుద్ధి చెప్పాలన్నారు. ఇదేం పాలసీ అని నిలదీయాలని పిలుపునిచ్చారు. సింగరేణి సీఅండ్ఎండీ, ఉన్నతాధికారులను ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు పంపించి బొగ్గు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి పంపించామని చెప్పారు. ఖమ్మంలో ఐరన్‌ఓర్ పరిశ్రమలకు అనుకూలంగా ఉందన్నారు. సింగరేణి వజ్రపు తునుక అని కొనియాడారు. సింగరేణి గనులను తెలంగాణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతితో దేశ పరిశ్రమలపై ఆర్థిక భారం మోపాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సింగరేణిని ముంచుదామని బీజేపీ కంకణం కట్టుకొని తిరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాం అస్సాం, దేశ రాజధాని ఢిల్లీలో సైతం పవర్ హాలీడేలతో పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా చెబుతున్నామన్నారు. దేశంలోని గ్రామాలు, పట్టణాలకు 24 గంటల పాటు 150 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే బొగ్గు నిల్వలు 361 బిలియన్ టన్నులు ఉన్నాయని చెప్పారు. ఇంత మంచి పరిశ్రమను ముంచే కుట్ర జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.