‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లోని వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ ‘జీరో’ దందా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్న వ్యాపారులకు కొద్దిరోజులుగా ఆ అవకాశం లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను బద్నాం చేసే కుట్రలకు తెర లేపుతున్నారు. ‘ఏఎంసీ’ అడ్డాగా అక్రమ ధనార్జనకు మరిగిన ఖరీదుదారులు.. ‘జీరో’ దందానే లక్ష్యంగా కుయుక్తులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు ఎగనామం పెట్టేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులంతా ‘సిండికేట్’ అయ్యారు. సోమవారం ఏకంగా ఏఎంసీలో మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. అసలు ఎత్తుగడ ‘జీరో’ వ్యాపారమే అయినప్పటికీ.. ఎగుమతులు లేవని, ఆర్థిక ఇబ్బందులున్నాయని కారణాలు చెబుతున్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోళ్ల నిలిపివేతతో అప్రమత్తమైన ఏఎంసీ పాలకవర్గ బాధ్యులు, అధికారులు.. తక్షణం వ్యాపారులతో సీక్రెట్‌గా సమావేశ మయ్యారు. తమ జీరో వ్యాపారానికి గేట్లు ఎత్తాలంటూ ఆ సమావేశంలో డిమాండ్ పెట్టినట్లు తెలిసింది.
– ఖమ్మం, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
‘ఖమ్మం ఏఎంసీలో జీరో వ్యాపారం నడవడానికి వీల్లేదు. జీరో అన్న పదానికే ఆస్కారం ఉండొద్దు. జీరో వ్యాపారం జరిగినట్లు నా దృష్టికి వస్తే కఠిన చర్యలకు బాధ్యులవుతారు’ అంటూ.. అప్పటి వరకు ఖమ్మం ఏఎంసీలో జరుగుతున్న జీరో వ్యాపారాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల అన్నమాటలివి. అప్పటి నుంచి గడిచిన రెండు నెలలుగా ఖమ్మం ఏఎంసీలో ‘జీరో’ అన్న పదానికే అవకాశం లేకుండా పోయింది. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తేగా.. వ్యాపారులు కొనుగోలు చేస్తారు. విక్రయించిన ఉత్పత్తుల్లో ఖరీదుదారులు ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ఎగ్గొట్టే క్రమంలో ‘జీరో’ దందాకు తెరలేపుతూ వచ్చారు. అనేక ఏళ్లుగా వారి జీరో వ్యాపారం ‘మూడు పువ్వులు-ఆరు కాయలు’గా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల ఇటీవల వ్యాపారుల జీరో దందాకు ఫుల్స్టాప్ పడింది. దీంతో కొద్దిరోజులుగా మార్కెట్లోకి రైతులు తెచ్చే ప్రతి పంటకూ లెక్కకట్టి అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని వ్యాపారులు.. పలు సాకులతో మార్కెట్లో కొనుగోళ్లకు బ్రేకులు వేస్తే మళ్లీ తమ ‘జీరో’ దందా డిమాండ్‌ను తెరపైకి తేవచ్చనే ఆలోచన చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం మార్కెట్లో మిర్చి పంటను విక్రయించేందుకు సోమవారం వచ్చిన రైతులకు ఏఎంసీ వ్యాపారులు మొండిచేయి చూపించారు. ఉదయం జెండాపాట పూర్తయిన వెంటనే కొనుగోళ్లు చేయకుండా మిర్చి వ్యాపారులు వెళ్లిపోయారు. అయితే, కొంతమంది ఖరీదుదారులు మిర్చి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనప్పటికీ వ్యాపారుల సిండికేట్ భయానికి వారు కూడా వెనక్కితగ్గారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన మిర్చిని కొంతమేర ఆన్లైన్లో నమోదు చేయకుండా జీరో దందాకు అవకాశం కల్పించాలని వ్యాపారులంతా మార్కెట్ సెక్రటరీని, పాలకవర్గ సభ్యులను డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, అధికారులు కలిసి దిగుమతి శాఖ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయితే, జీరోకు అవకాశమిస్తేనే కొనుగోళ్లు చేస్తామని, లేదంటే కొనుగోళ్లు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ తరువాత సమాధానం కూడా చెప్పకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.
మిర్చి పంటను విక్రయించుకుందామనే ఆశతో రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకొచ్చారు. జెండాపాట పూర్తయ్యాక వ్యాపారులు పంట కొనుగోళ్లను నిలిపివేశారు. ఇది సరికాదు. ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేయడంపై వ్యాపారులను మందలించాం. మంగళవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఎగుమతులు, ఆర్థిక ఇబ్బందుల వంటి సమస్యల పేరుతో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీనిపై వారితో సమావేశమై చర్చించాం. వ్యాపారులు తమ అభిప్రాయాన్ని చెబుతామంటూ వెళ్లిపోయారు.