ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామానికి చెందిన బానోతు వీరన్న.. చేతికొచ్చిన 20 క్వింటాళ్ల మిర్చిని కల్లంలో ఆరబోసి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నాడు. గురువారం ఓ ప్రైవేటు వ్యాపారి కల్లం వద్దకు వచ్చి క్వింటా రూ.18 వేలకు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నిరాకరించాడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.20 వేలు పలుకుతోందని, అక్కడే అమ్ముకుంటానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మిర్చి పంటను ఖమ్మం మార్కెట్కు తీసుకొచ్చాడు. తీరా మార్కెట్లో వ్యాపారి రూ.16 వేలకు ధర నిర్ణయించడంతో వీరన్న నిర్ఘాంతపోయాడు. మార్కెట్లో క్వింటా మిర్చి రూ.21 వేలు పలుకుతుందని ఆశతో వస్తే వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించాడు.
ఖమ్మం రూరల్ మండలం హస్నాతండాకు చెందిన అజ్మీరా చందు తాను పండించిన 50 బస్తాల మిర్చిని శుక్రవారం ఖమ్మం మార్కెట్కు తీసుకొచ్చాడు. పంటను పరిశీలించిన ఓ వ్యాపారి తొలుత రూ.17,600కు కొనుగోలు చేస్తానని ధర నిర్ణయించి వెళ్లాడు. మళ్లీ కాసేపటికి చందు పంట వద్దకు వచ్చి అదే వ్యాపారి ఆ ధరను చెల్లించలేనని, రూ.17 వేలే ఇస్తానని, లేదంటే నీ ఇష్టమని చెప్పి వెళ్లిపోయాడు. వ్యాపారి మాటలకు ఆ రైతు నివ్వెరపోయాడు.
రఘునాథపాలెం, జనవరి 23 : ఖమ్మం మార్కెట్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కేవలం వీరన్న, చందూలవి మాత్రమే కాదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం మిర్చి పంటను తీసుకొచ్చిన రైతులందరివీ. దీంతో రైతులంతా ఒక్కటయ్యారు. మార్కెట్లో వ్యాపారులు చేస్తున్న ధర దగాపై మిర్చి రైతులంతా కన్నెర్ర జేశారు. పంట కొనుగోళ్లు జరగనీయకుండా మార్కెట్ ప్రధాన గేట్లను మూసి వేశారు. మిర్చి కొనుగోళ్లు చేపట్టే మార్కెట్ గేటు బయట బైఠాయించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మొదలైన ఈ ఆందోళన మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది.
ఉదయం 7 గంటలకు మార్కెట్ అధికారులు జెండాపాట నిర్వహించగా.. క్వింటా మిర్చి రూ.20,100 పలికింది. జెండా పాట అనంతరం వ్యాపారులు రైతుల పంటల వద్దకు వెళ్లి క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. జెండా పాట కంటే ధరను భారీగా తగ్గించి కొనుగోలు చేస్తామని చెప్పడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తక్కువ ధరకే కొనుగోలు చేస్తామన్న వ్యాపారుల వైఖరిపై రైతన్నలు రగిలిపోయారు. తమ గోడును అధికారులకు చెప్పుకునేందుకు వెళ్తే అధికారులెవ్వరూ అందుబాటులో లేకపోవడంతో కర్షకుల కడుపు మరింత రగిలిపోయింది. చేసేదేమీలేక మిర్చి రైతులు మార్కెట్ కార్యాలయం బయట బైఠాయించారు. పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నారు.
తమను మోసగించేందుకు వ్యాపారులు సిండికేటై తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని రైతులు మండిపడ్డారు. వ్యాపారుల కుయుక్తులను అడ్డుకోవాల్సిన అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కరువు కాలంలో పండించిన మిర్చి పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే తక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూడడంపై రైతులు ఆవేదన చెందారు. మూకుమ్మడిగా రైతులంతా మార్కెట్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మార్కెట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
‘జెండా పాటపై క్వింటాకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు తగ్గించి కొనుగోలు చేస్తామంటే ఎలా? అంటూ రైతులు రగిలిపోయారు. అందుకు ఏమాత్రమూ ఒప్పుకునేది లేదంటూ తేల్చి చెప్పారు. వందల సంఖ్యలో రైతులు మార్కెట్ సమాచార కేంద్ర సమాచార కార్యాలయం ఎదుటకు వచ్చి లోపలకు చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగిపోయారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తీరా మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మార్కెట్ అధికారులు జోక్యం చేసుకొని వ్యాపారులను పిలిపించి సమావేశం నిర్వహిస్తామని సముదాయించి చెప్పి వెళ్లిపోయారు. కానీ, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాపారులు తాము అనుకున్న ధరకే కొనుగోలు చేసి కాంటాలు చేపట్టారు. దీంతో రైతులు ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు దక్కకుండా పోయిందని, మార్కెట్లో వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన చెందారు.
ఐదెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేశాను. 8 క్వింటాలు అమ్ముకుందామని మిర్చిని మార్కెట్కు తీసుకొచ్చాను. పంటను పరిశీలించిన వ్యాపారి రూ.13 వేలు మాత్రమే ధర నిర్ణయించాడు. జెండా పాట రూ.20 వేలు ఉందని ప్రశ్నించారు. ‘అమ్మితే అమ్ము.. లేకుంటే ఇంటికి తీసుకెళ్లు..’ అంటూ ఆ వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కల్లాల్లో పంటను ఆరబోసి దొంగలు పడకుండా రాత్రిళ్లు చలిలో కాపలా కాస్తున్నాం. కానీ, మార్కెట్లో మాత్రం పట్టపగలే వ్యాపారులు దొంగల రూపంలో రైతుల పంటను దోచుకుంటున్నారు.
-జే.నాగమణి, మహిళా రైతు, తిరుమలాయపాలెం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయి మిర్చి రైతులను దోచుకుంటున్నారు. ఎండను, వానను ఖాతరు చేయకుండా కష్టపడి పంటను పండించాం. అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు మా శ్రమను దోచుకుంటున్నారు. అధికారులు కూడా వారికి కొమ్ముకాస్తున్నారు. సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలో రైతులకు న్యాయం జరగడం లేదు.
-దేశ బోయిన ఉపేందర్, రైతు, రాఘవాపురం, ముదిగొండ