‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుంది.. దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు ఆగిపోతయ్.. కరెంట్ కష్టాలు మొదలైతయ్.. ధరణి పోర్టల్ ఉండదు.. భూములకు భద్రత ఉండదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కేవలం డబ్బుందన్న అహంతోనే రాజకీయాలు చేస్తున్నారు.. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీఆర్ఎస్ను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలి.. ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి సండ్ర వెంకటవీరయ్యను ఎన్నికల్లో గెలిపించాలి.. సండ్ర ఎప్పుడు నన్ను కలిసినా నియోజకవర్గ సమస్యలను నా దృష్టికి తీసుకువస్తారు.. పట్టుబట్టి పనులు సాధిస్తారు..’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండల కేంద్రంలో బుధవారం సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. త్వరలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయిస్తామన్నారు.. ఖమ్మం జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందిస్తామన్నారు.
‘నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి సండ్ర వెంకటవీరయ్య. అభివృద్ధికి సంబంధించి ఏ పని కావాలన్నా పట్టువదలని విక్రమార్కుడిలా నా చుట్టూ తిరిగి పని చేయించుకోవడంలో దిట్ట. 108 వంటి అంబులెన్స్‌లు ఆలస్యంగా వస్తాయేమో కానీ సండ్ర మాత్రం ఒక్క ఫోన్ కాల్చేస్తే నియోజకవర్గ ప్రజల వద్దకు పక్షిలా వాలే మనిషి. నాకు ఆప్తులైన ఎమ్మెల్యేల్లో సండ్ర ఒకరు. సండ్ర వచ్చిన తర్వాతే సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఇలాంటి ఎమ్మెల్యేను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూస్తుంటే సండ్ర వెంకటవీరయ్య 70వేల ఓట్ల మెజార్టీతో గెలవడం తథ్యం’.
ఖమ్మం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండల కేంద్రంలో బుధవారం సత్తుపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దళితబంధు, రైతుబంధు వంటి పథకాలను నిలిపేస్తారన్నారు. రాష్ట్రంలో కరెంట్ బంద్ అవుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వమని కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెడతారన్నారు. పోరాటం చేసి తాను తెలంగాణ తెచ్చినా, తానెప్పుడూ ప్రజలను తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. అహంకారపూరితంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు నాలుగు పైసలు జేబులోకి రాగానే ధన మదంతో బీఆర్ఎస్కు సవాళ్లు విసురుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ధన బలంతో ఏమైనా చేయెచ్చని అనుకునే వారికి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కూరగాయలు కొనే సమయంలో పుచ్చులుంటే ఏరి వేసి మంచివి కొంటామని, మంచినీళ్ల కుండ కొనేటప్పుడు ఓటుపోయిందా? లేదా? అని పరిశీలిస్తామన్నారు. కానీ ఐదేళ్లు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే శాసనసభ్యుడిని ఎంపిక చేసుకునేటప్పుడు అన్ని విధాలా పరిశీలించి ఓటు వేయాలన్నారు. కొందరు స్వార్థపరులు ఇచ్చే రూ.60, రూ.70 విలువ చేసే గడియారాలకు సంతృప్తి చెంది బతుకులను తాకట్టు పెట్టుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సొంత భూములపై పరాయి పెత్తనం వస్తుందన్నారు. రైతుల భూములు పకడ్బందీగా ఉండాలనే తమ ప్రభుత్వం ‘ధరణి’ని అమలు చేస్తున్నదన్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. రాహుల్‌గాంధీకి వ్యవసాయం అంటే ఏమిటో తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
గోదావరి జలాలను పాలేరుకు తరలించి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. త్వరలో ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయిస్తామన్నారు. నీటి వసతి లేక సాగర్ ఆయకట్టు ఎండిపోతున్న సమయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. తాను చొరవ చూసుకుని నీటి విడుదలకు చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. సీతారామా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు తీరుతాయన్నారు.
ఎమ్మెల్యే వెంకట వీరయ్యపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురింపించారు. వెంకటవీరయ్య ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపిస్తారని సీఎం అన్నారు. అవసరం ఎక్కడ ఉన్నా అక్కడ సండ్ర వాలిపోతారన్నారు. సండ్ర తనను కలిసిన ప్రతిసారీ సత్తుపల్లికి ఏదైనా చేయాలనే కోరతారన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు అందిస్తామన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలాన్ని దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వందశాతం యూనిట్లు అందించామని గుర్తుచేశారు. తాను మాట్లాడింది సిరాక్షరమన్నారు. ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో దళితబంధు అమలు చేయాలని తనను కోరలేదన్నారు. ఎస్సీల కష్టాలను చూసి తాను దళితబంధు అమలు చేశానన్నారు.
రాజకీయాల్లో బండి పార్థసారథిరెడ్డి వంటి పారిశ్రామికవేత్త ఉండాలన్నారు. పార్థసారథిరెడ్డికి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందన్నారు. ఆయన తనను ఏమీ అడగలేదన్నారు. తానే స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించి రాజ్యసభ సభ్యుడిని చేశానన్నారు.
ప్రధాని మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అలాగే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని తనపై వత్తిడి తెచ్చారని, కానీ తాను బతికి ఉన్నంతవరకు మీటర్లు బిగించనని ఖరాఖండిగా తేల్చి చెప్పానన్నారు. ఫలితంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.25 వేల కోట్లను నిలిచిపోయాయన్నారు. అయి నా తాను వెనక్కి తగ్గలేదన్నారు. సభలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరా వు, రాజ్యసభసభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధు, ఎమ్మెల్యేలు రాములునాయ క్, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జీహెచ్ఎంసీ మాజీ నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ రాజ్య సృష్టికర్తగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని గర్తుచేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నానని అన్నారు. 15 ఏళ్లుగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మూడుసార్లు సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.1,000 కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందే ప్రజల కళ్లముందే ఉందన్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గ ప్రజలంతా పొరుగు రాష్ట్ర అభివృద్ధిని, మన రాష్ట్ర అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, రహదారుల విషయంలో ఆంధ్రా ప్రజలు అసూయ పడేలా అభివృద్ధి చేశామని వివరించారు. దళితబంధు పథకంలో ఎస్సీల ఆర్థిక స్థితిగతులను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందని స్పష్టం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి దళితబంధు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం జారీ చేసిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలో 30 వేల ఎస్సీ కుటుంబాలకు దళితబంధు ఇచ్చేందుకు సర్వే కూడా పూర్తయిందన్నారు. అడుగడుగునా ఉన్న అభివృద్ధి ముద్రలు ప్రతిపక్షాలకు కనబడడంలేదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. కానీ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్న విషయాన్ని ఓటు ద్వారా రుజువు చేయాలని పిలుపునిచ్చారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను, నాలుగోసారి ఎమ్మెల్యేగా తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.