మధిర, ఏప్రిల్ 11 : పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్ రావు అన్నారు. గ్యాస్ సిలిండర్ పై పెంచిన రూ.50 తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధిర పట్టణంలోని తెలంగాణ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకవైపు ఉపాధి అవకాశాలు దెబ్బతిని, కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలు అవస్థలో ఉంటే, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం వారిపై భారాలు మోపడం సిగ్గుచేటన్నారు. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లుగా పేదల పొట్టగొట్టి కార్పొరేట్ల బొజ్జ నింపుతున్నారని విమర్శించారు.
అంతర్జాతీయగా ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలని కానీ దానికి భిన్నంగా పెంచుతున్నట్లు మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచడమే కాకుండా ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ కూడా తగ్గించారని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు పెంచడం వల్ల సబ్సిడీ ఇస్తున్నరాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భారమేనని అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను కలుపుకుని గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలన్నారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేస్తుందని 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని చూస్తుందన్నారు. అలాగే హమాలీ బోర్డ్ ను మరింత మెరుగు పరచాలని, వెల్ఫేర్ బోర్డులకు బడ్జెట్ కేటాయించాలని, గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు శీలం నరసింహారావు, పట్టణ, మండల కార్యదర్శులు పడకంటి మురళి, మందా సైదులు, నాయకులు పాపినేని రామ నర్సయ్య, తేలపోలు రాధాకృష్ణ, ఓట్ల శంకర్రావు, వి.మధు, గోపి, పట్టణ, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.