ఖమ్మం, డిసెంబర్ 7: తెలంగాణకు కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయడం బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష మాజీ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తెలంగాణకు 21 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని తాము కోరితే కేంద్రం ఏడు నవోదయ విద్యాలయాలను మాత్రమే మంజూరు చేసిందని అన్నారు.
ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక పాలనా సౌలభ్యం కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతనంగా ఏర్పడిన జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలన్న అంశాన్ని 17వ లోక్‌సభలో తాను అనేకమార్లు ప్రస్తావించినట్లు చెప్పారు.
కేంద్రమంత్రులకు లేఖలు రాశానని, పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించానని, ప్రశ్నలు లేవనెత్తానని, పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీలం నిరసనకు దిగామని గుర్తుచేశారు. తమ పోరాట ఫలంగానే తెలంగాణకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏడు నవోదయవిద్యాలయాలను మంజూరు చేసిందని పేర్కొన్నారు.