ఖమ్మం అర్బన్, మార్చి 19: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్విజిలేషన్ విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు ఉత్తర్వులు సైతం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు డ్యూటీలు మార్చాలంటూ ఉపాధ్యాయుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి ఇన్విజిలేషన్ డ్యూటీ నుంచి సిట్టింగ్ స్కాడ్ వరకు అన్నింటా ఇదే వరుస కొనసాగుతున్నది. దీంతో పరీక్షల విభాగానికి రెగ్యులర్ అసిస్టెంట్ కమిషనర్ లేకపోవడంతో సిబ్బంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) చాలా కీలకం. హాల్‌టికెట్ల జారీ మొదలు ప్రత్యేక కేటగిరీలు, నామినల్ రోల్స్, సమాధాన పత్రాలు, ప్రశ్నపత్రాలు సరఫరా చేయడం, సీఎస్, డీవోల కేటాయింపు, ఇన్విజిలేషన్ డ్యూటీలు, ప్లయింగ్ స్కాడ్‌ల కేటాయింపులో కీలకంగా ఉంటారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరీక్షల విభాగం ఉన్నతాధికారులైన డిప్యూటీ కమిషనర్‌కు వివరించి ప్రత్యామ్నాయం కోసం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతటి కీలకమైన పోస్టులో రెగ్యులర్ ఏసీ లేకుండానే పరీక్షలకు వెళ్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అక్టోబర్ నుంచి ఏసీగా పనిచేసిన ధన సెలవుపై వెళ్లడంతో రఘునాథపాలెం ఎంఈవో రాములుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు నెలలు అదనపు బాధ్యతలు నిర్వర్తించిన రాములు పని ఒత్తిడితో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం రమేశ్‌కు అసిస్టెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను డీఈవో అప్పగించారు. ఆయన హెచ్ఎంగా, ఇంచార్జి ఏసీగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇంచార్జిగా నియమించిన తర్వాత ర్యాటిఫికేషన్‌కు ఉన్నతాధికారులకు పంపించినా ఇప్పటివరకు ఇంచార్జి ఏసీ ర్యాటిఫికేషన్ పూర్తి కాలేదు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం 97 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో 20కిపైగా ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోనివి. ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమెరాలు పనిచేస్తుండగా.. గత పరీక్షల సమయంలో అప్పటి కలెక్టర్ ప్రభుత్వ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన వాటిలో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తెరవాలనే నిబంధనను ఈసారి కూడా అమలు చేయనున్నారు. దీంతో చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో టెక్నికల్ సిబ్బంది పాఠశాలల్లో తిరుగుతూ సీసీ కెమెరాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని విద్యాశాఖాధికారులకు వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా, వాటిలో సిమ్ కార్డులు వేసి కలెక్టరేట్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టారు. రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తాయా? లేదా? అనేది వేచి చూడాలి.
కాగా.. ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించేందుకు ఆయా ఎంఈవోల సహకారంతో పరీక్షల విభాగం అధికారులు డ్యూటీలు కేటాయించారు. లాంగ్వేజెస్ పరీక్షకు నాన్ లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు, నాన్ లాంగ్వేజెస్‌కు లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించేలా నిబంధనలు పాటిస్తున్నారు. జిల్లాలో 1,585 మంది ఇన్విజిలేటర్లు అవసరం కాగా.. చాలా వరకు ఉత్తర్వులు జారీ చేయగా.. వీరిలో కొందరు తమకు డ్యూటీలు మార్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. తమకు నచ్చిన చోట వేయాలని కొందరు, మరికొందరు డ్యూటీ చేయలేం, ఆరోగ్యం సహకరించడం లేదని విన్నవిస్తుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంకా ఇన్విజిలేషన్ డ్యూటీలు వేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఇన్విజిలేటర్ల కొరత ఉంది. వీరితోపాటు ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్కాడ్లుగా ఇతర విభాగాల అధికారులను కలెక్టర్ నియమించారు. వారు సైతం తమకు కేటాయించిన కేంద్రం కాకుండా మరో కేంద్రానికి మార్చాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఇన్ని ఒత్తిళ్ల మధ్య పరీక్షల విభాగంలో సిబ్బందికి పనిచేయడం ఓ సవాల్‌గా మారింది. కాగా.. డ్యూటీలు, కేంద్రాల మార్పు విషయమై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవని, ఉత్తర్వులను సిబ్బంది విధిగా పాటించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో ఏటూరు సోమశేఖరశర్మ తెలిపారు.