ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 7 : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా పత్తి మద్దతు ధర క్వింటాకు రూ.7,521 చొప్పున లభించే పరిస్థితి లేదని, రూ.5 వేల నుంచి రూ.6,700లకు మాత్రమే ధర పలుకుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కొనుగోళ్ల సమయంలో ధర నిర్ణయిస్తే.. కాంటాలు పెట్టేప్పుడు కోత పెట్టి రైతులకు నష్టం కలిగించడంపై మార్కెట్ కార్యదర్శి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిందని, అరకొరగా చేతికొచ్చిన పంట అమ్మకాల్లోనూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్, సీపీఎం నాయకులు ఎర్రా శ్రీకాంత్, వై.విక్రమ్, ఎర్రా శ్రీనివాసరావు, కృష్ణ, నర్సింహారావు, భూక్యా శ్రీనివాస్, ప్రసాద్, కే మీరా, ఊరడి సుదర్శన్‌రెడ్డి, ఉపేందర్, యాకయ్య పాల్గొన్నారు.