ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ సాధించడానికి రక్తం చిందించింది బీఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణవాదులుగా తమకు త్యాగాలు కొత్తకాదని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు ఇస్తామంటే మరోసారి రక్త తర్పణం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
రైతుల కష్టాలను చూసి ముఖ్యమంత్రిగా స్పందించాల్సింది రేవంత్‌రెడ్డి.. అవగాహన రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తుండడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని, ఇక్కడి జలవనరులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి నిలువునా ముంచుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఒక డ్రామా మాత్రమేనని అన్నారు. ఏపీలో ఎన్నో ఏళ్లుగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ కొట్టుకుపోయినా అక్కడి నేతలు తమ ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడలేదని గుర్తుచేశారు. కానీ, ఇక్కడి రేవంత్‌రెడ్డి తీరు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీరు భిన్నంగా ఉందని అన్నారు. దాదాపు రూ.90 వేల కోట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని రోజూ తిడుతూ అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ మైనింగ్ కార్పొరేషన్‌కి కావాల్సిన మైన్లను నామినేషన్ పద్ధతిలో కేంద్రం ఇస్తున్నప్పుడు.. తెలంగాణ బిడ్డగా, గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. సింగరేణికి నామినేషన్ పద్ధతిలో కోల్ బ్లాక్స్ ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూ.3,200 కోట్ల లాభాలతో సింగరేణిని అప్పగిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పనులన్నీ మళ్లించి చివరకు రూ.4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ చేసి అప్పుల పాలుచేసిందని ధ్వజమెత్తారు. 40 లక్షల టన్నుల బొగ్గుమాయంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సింగరేణి పరిధిలో గోలేటి ఓపెన్ కాస్ట్, మాధారం ఓపెన్‌కాస్ట్, కేకే ఓసీ, పూసపల్లి, మణుగూరు ఓపెన్‌కాస్ట్ మైన్లు ఉన్నాయని అన్నారు. కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని వీటికి పర్యావరణ అనుమతులు తేవాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఢిల్లీలో కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రాణాలకు తెగించి భూగర్భంలో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను (ఇన్‌కం టాక్స్) రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేరు చెప్తేనే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు వెన్నులో వణుకు పుడుతోందని స్పష్టం చేశారు. అందుకే, బీఆర్ఎస్ను అంతమొందించడమే లక్ష్యంగా ఆ మూడు పార్టీలూ లోపాయికారీగా చేతులు కలిపాయని ఆరోపించారు. బయటకు మాత్రం ఒకరిపైకి మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని, లోపల మాత్రం బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం 2015లో తెచ్చిన బొగ్గు గనుల చట్టం ద్వారా దేశ వనరులను అదానీ, అంబానీ వంటి గుజరాతీ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాడు హైదరాబాద్‌లో వేలంపాటలు జరుగుతుంటే.. భట్టి విక్రమార్క, కిషన్‌రెడ్డి కలిసి అంపైరింగ్ చేశారని ఆరోపించారు. హరీశ్‌రావు సింగరేణి అక్రమాలపై గళం విప్పిన తర్వాతే కిషన్‌రెడ్డికి భరోసా యాత్ర గుర్తొచ్చిందని అన్నారు. 16,500 మంది కార్మిక వారసులకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణల పేరుతో, మెడికల్ బోర్డుల పేరుతో ఆ ఉద్యోగాలను ఆపేస్తూ వారిని తీవ్రంగా హింసిస్తోందని మండిపడ్డారు. డయాలసిస్ బ్యాగు పట్టుకొని తిరుగుతున్న కార్మికుడికి కూడా మెడికల్ అన్‌ఫిట్ సర్టిఫికెట్ ఇవ్వని దుర్మార్గపు పాలన కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు.
నేషనల్ హైవేల (సూర్యాపేట – ఖమ్మం, కోదాడ – ఖమ్మం తదితర) కాంట్రాక్టులన్నీ బీజేపీకి వెన్నెముకగా ఉన్న అదానీకి లేదంటే మేఘా కృష్ణారెడ్డికి ఇస్తూ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కాలువలు తవ్వి, పంపులు పెట్టింది 90 శాతం కేసీఆరేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ పంపులు ఆన్‌చేసి నెత్తిన నీళ్లు చల్లుకుంటూ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు.
తెలంగాణ హక్కులను కాపాడేందుకు, సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పార్లమెంట్ లోపలు, బయట బీఆర్ఎస్ నూరు శాతం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బెల్లం వేణు, బొమ్మెర రామ్మూర్తి, వరప్రసాద్, ఉప్పల వెంకటరమణ, లక్కినేని సురేందర్, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, తాజుద్దీన్, గుండ్లపల్లి శేషగిరిరావు, లింగనబోయిన సతీశ్, యలమద్ది రవి, మహమ్మద్ రఫీ, బలుసు మురళీకృష్ణ, నెమలికొండ వంశీ, ఈదుల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.