హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వ శాఖలు అక్రమాలకు చిరునామాగా నిలిచాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఉన్న విద్య, మున్సిపల్, హోమ్ శాఖల్లో అవినీతి పెచ్చరిల్లుతుంటే నియంత్రించడంలో సీఎం రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ పాలనలో ఫేక్ ఎన్వోసీలు తయారు చేస్తున్నారు. ఏకంగా కాలేజీల అనుమతికి హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారు’ అని ఆరోపించారు. సీఎం సొంత శాఖలో ఇంతటి అక్రమాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. రోజూ 18 గంటలు రివ్యూచేసే సీఎం రేవంత్‌రెడ్డి ఆ సమయంలో ఏం చేస్తున్నారు? అని బుధవారం ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఫిబ్రవరిలో ఫైర్ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకొన్న జూనియర్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అధికారులు లేక్‌వ్యూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలకు వెనుకాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు, కాలేజీ యాజమాన్యాలు అవినీతి, అక్రమాలను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
సొంత శాఖలపై సీఎం దృష్టి పెట్టాలి
‘రేవంత్‌రెడ్డీ.. క్షుద్ర, తాంత్రిక పూజల గురించి స్క్రిఫ్ట్ రాసిచ్చే బదులు, ఫోర్జరీ సం తకాలతో అవినీతికి పాల్పడే వారిని దొరకబట్టమని స్క్రిఫ్ట్ రాసివ్వండి’ అని ఆర్ఎస్పీ హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టారని ఆరా తీయడాన్ని మాని తన సొంత శాఖల్లోని అక్రమాలపై దృష్టి పెట్టాలని సీఎంకు చురకలంటించారు. ఫైర్ సేఫ్టీ అనుమతుల్లేకుండా కాలేజీలు నిర్వహిస్తే ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లుతెరిచి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా అక్రమాలపై సీఎం చర్యలు తీసుకొంటారా? లేక వదిలేస్తారా? అన్నది ఆయన ఇష్టమని పేర్కొన్నారు. ప్రజలు మాత్రం అన్ని విషయాలను గమనిస్తున్నారని, బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.