మామిళ్లగూడెం, ఆగస్టు 5: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 86.98 శాతం ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ అయ్యాయని, పోలింగ్స్టేషన్ వారీగా డిజిటలైజేషన్ నివేదికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామని తెలిపారు. ప్రత్యేక పరిశీలనలో జిల్లాలో 95,740 మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు, 33,134 మంది మృతిచెందినట్లు గుర్తించామన్నారు.
అదేవిధంగా 42,814 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాలేదని తెలిపారు. ఈ నెల 10 నాటికి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్తోపాటు పోలింగ్స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో 19 కొత్త పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేయడానికి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తామని, అక్టోబర్ 15 నాటికి వాటిని పరిష్కరిస్తామని, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని వివరించారు. ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, ఎస్డీసీ సదానందం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రాజు, డీటీ అన్సారీ, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.