న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం న్యూఢిల్లీ బలియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,000 తగ్గి రూ.1,54,400గా నమోదైంది. ఆగస్టు 7 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఇది రూ.1.54 లక్షలుగా ఉన్నది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు నమోదు కాలేదు.
కిలో వెండి రూ.2,34,600గా నమోదైంది. బంగారానికి డిమాండ్ పడిపోవడం, గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,300 డాలర్ల దిగువకు పడిపోవడం వల్లనే ధరలు నెల రోజుల కనిష్ఠానికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా డాలర్ బలపడటం, ఈల్డ్స్ పెరుగుతుండటంతోపాటు పెరిగిన ముడి చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు మరింత పెరుగడంతో ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉండటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని ఆయన చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 22.8 డాలర్లు తరిగిపోయి 4,276.52 డాలర్లకు పడిపోగా, వెండి 63.07 డాలర్ల వద్ద ఉన్నది.