న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తే తక్షణ ముప్పులను తగ్గించే లక్ష్యంతో భారత్ మూడు అంశాలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించింది. కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేయడం, నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగించడం, నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై ఈ ప్రతిపాదన దృష్టి సారిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంధన సదుపాయాలు, ఇతర మౌలిక సౌకర్యాల కేంద్రాలపై దాడులను నిలిపివేయడం, నల్ల సముద్రం(బ్లాక్ సీ) ద్వారా ధాన్యం, ఇంధన రవాణా నిరంతరాయంగా సాగేలా చూడటం, అలాగే ఆ సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు ముగింపు పలకడం వంటి అంశాలను ఈ ప్రతిపాదన లక్ష్యంగా పెట్టుకుంది.