అత్యాశ పనికిరాదు వీరా.. తిరిగి వెనక్కి వెళ్లిపొమ్ము
‘విజయోస్తు వీరాధివీరా..! నీ తెలివితేటలతో భయంకరమైన వ్యాధులను నిర్మూలించే మహిమాన్విత బంగారు పత్రంతో పాటు ఆకలి కేకలను దూరంచేసే అక్షయాన్న పాత్రను, జలసిరులను కురిపించే జల కలశాన్ని, విశ్వాంతరాళం నుంచి వచ్చే ఆపదల నుంచి కాపాడే భూకవచాన్ని, మనిషి మేదస్సును దాటుకొని దాడిచేసే జీవులను నియంత్రించే జ్ఞానమణిని చేజిక్కించుకొన్నావు’ అని పలికింది దైవవాణి.
అది ఎవరు
కృష్ణ.. ద టైమ్ ట్రావెలర్, ది మిస్టరీస్ ఆఫ్ ద్వారక-13
ఇంకా చెబుతూ ‘సకల జీవరాశులను కాపాడటానికి ఈ వరాలు .. పరిస్థితి చేజారిపోయే అత్యవసర సమయాల్లో సాయపడుతాయి. ఈ చతుర్మహా వరాలకు సంబంధించిన వివరాలు తొలి వరమైన బంగారుపత్రంపై ఇకనుంచి కనిపిస్తాయి. ఇక, నువ్వు తిరిగి వెళ్లిపోవచ్చును’ అంటూ అప్పటివరకూ దేదీప్యమానమైన వెలుగుతో కనిపించిన దైవవాణి క్రమంగా మసకబారడం ప్రారంభించింది. ఇంతలో కలుగజేసుకొన్న రుద్ర.. ‘తల్లీ.. నేను వచ్చిన పని ఇంకా పూర్తికాలేదు’ అంటూ వినమ్రంగా అన్నాడు. మసకబారుతున్న ఆ వెలుగు పునఃస్థితిలోకి వచ్చింది. ‘నువ్వు వచ్చిన పని పూర్తికాలేదా? అంటే?? ఏ పని మీద వచ్చావు??’ అంటూ దైవవాణి సూటిగా ప్రశ్నించింది.
రుద్ర మౌనంగా ఉండిపోయాడు. దీంతో మిగతా టీమ్ సభ్యులంతా ఏం జరుగుతుందో అర్థంకాక నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ఇంతలో మళ్లీ కలుగజేసుకొన్న దైవవాణి.. ‘ముందే చెప్పినట్టు.. పంచభూతాలతోనే మనిషి ప్రయాణం. అవిలేని నాడు ఈ ప్రాణికోటే లేదు. వాటిని సంరక్షించాలనే మా తాపత్రయం. అందుకే పంచ మహా వరాలను సాధించే మార్గాన్ని ద్వాపర యుగంలోనే నిర్ణయించాం. సజ్జనుల చేతికి వీటిని చేర్చాలనే ఇన్ని ఆటంకాలను సృష్టించాం. ఆ ఆటంకాలను అధిగమించి వాటిని నువ్వు సాధించావు. అంటే, నువ్వు వచ్చిన పని పూర్తయ్యింది. అత్యాశ పనికిరాదు వీరా.. తిరిగి వెనక్కి వెళ్లిపొమ్ము’ అంటూ దైవవాణి కొంచెం హెచ్చరిస్తున్నట్టు పలికింది.
దీనిపై స్పందించిన రుద్ర.. ‘తల్లీ.. ఇందులో నా అత్యాశ అనేది ఏమీలేదు. అత్యంత ముఖ్యమైన మరో వరాన్ని సాధించకపోతే, ఈ ఐదు మహావరాలు పొందినప్పటికీ, నిష్ప్రయోజనమే కదా’ అంటూ రుద్ర చెప్పగానే, అక్కడే ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ధరణితో పాటు ఆమె టీమ్ మెంబర్స్ శివ, రుత్విక్, శ్రియాన్ష్.. రుద్ర టీమ్ మెంబర్స్‌లో భాగమైన ఫోరెన్సిక్ ఇన్చార్జి జయ, హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, రుద్ర కజిన్ స్నేహిల్, జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ కరణ్, ఎథికల్ హ్యాకర్ హరిశ్వ ఇలా అందరూ షాకయ్యారు. ఇంతలో మళ్లీ కొనసాగించిన రుద్ర.. ‘తల్లీ.. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ప్రయాణించగలిగే కాలాతీత ప్రయాణాన్ని (టైమ్ ట్రావెల్) ఆధీనంలో ఉంచుకొనే వరం ఎలా సాధించాలో సెలవివ్వండి’ అంటూ రుద్ర అడగ్గానే దైవవాణి ఆగ్రహంతో ఇలా స్పందించింది.
‘ఓహో.. ద్వారక రహస్యాలనే కాదు ఏకంగా ఆ శ్రీకృష్ణపరమాత్ముడికి సమానమవ్వాలన్న లక్ష్యంతో ఇక్కడికి వచ్చావన్న మాట. అందుకేగా.. ఏదైతే కోరుకోకూడదో.. అదే ఆశిస్తున్నావు. కానీ, అది నీకు ఏ మాత్రం మంచిదికాదు. చూడూ.. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు. ఆయనకు సాటి ఈ ముల్లోకాల్లో మరేదీలేదు. కాలాతీత ప్రయాణాన్ని సాధించడమంటే ఆయన మీద పైచేయి సాధించాలనుకోవడమే. ఇది అవివేకం, మూర్ఖత్వం కూడా.. నీకు దక్కినదాంతో సంతృప్తిపడి వెనక్కివెళ్లు. లేకపోతే, తానే నిజమైన వాసుదేవుడినని భ్రమించిన పౌండ్రక వాసుదేవుడికి ఏ దుర్గతి పట్టిందో.. నా నోటితో చెప్పేలా చేయకు!’ అంటూ దైవవాణి మరింత కఠువుగా హెచ్చరించింది.
దీంతో అక్కడ ఉన్నవారందరూ భయంతో వణికిపోయారు. తీవ్రమైన హెచ్చరికలతో దైవవాణి ఆగ్రహంతో ఉన్నప్పటికీ, ప్రశాంతతను కొనసాగించిన రుద్ర వినమ్రతతో ఇలా అన్నాడు. ‘తల్లీ..!నేను ఓ సామాన్య మనిషిని. ఆ పరమాత్ముడి ముందు నేనెంత! శ్రీకృష్ణుల వారి మీద పైచేయి సాధించాలనుకొనే ఉద్దేశం నాకు ఎంతమాత్రమూ లేదు. అయినా.. నేను ఈ వరాన్ని సాధించాలనుకోవడానికి ఉన్న కారణం ఒక్కటే. మీ కృపతో మేము ఇప్పటికే సాధించిన ఆ పంచ మహావరాలను ఏదైనా పొరపాటుతో దురదృష్టవశాత్తూ తప్పుగా ప్రయోగిస్తే, ఆ రాతను మార్చే శక్తి ఉండాలిగా. అది కేవలం.. కృష్ణయ్యకే సొంతం. పైగా దాన్ని నేను నా స్వార్థానికి కోరుకోవట్లేదు. లోక కల్యాణం కోసమే అడుగుతున్నా’ అంటూ ప్రాధేయపడ్డాడు. అసలు రుద్ర ఏం చెప్తున్నాడో ఎవరికీ అర్థంకావట్లేదు. ఇంతలో మళ్లీ కలుగజేసుకొన్న దైవవాణి.. ‘మూర్ఖుడా.. ఆ శ్రీకృష్ణపరమాత్ముడికి కాలాతీత ప్రయాణ సామర్థ్యం (టైమ్ ట్రావెల్) ఉందని నీకు ఎవరు చెప్పారు? కృష్ణయ్యకు ఆ శక్తి ఉందని నిరూపించగలవా??’ అంటూ ఆగ్రహంతో మండిపడింది. నిరూపించగలను అన్నట్టు రుద్ర తలూపాడు. దీంతో రెట్టించిన ఆగ్రహంతో దైవవాణి మాట్లాడుతూ.. ‘ఇంతటి అహంకారం పనికిరాదు. సరే.. ఆ శ్రీకృష్ణపరమాత్ముడికి కాలాతీత ప్రయాణ సామర్థ్యం ఉన్నట్టు ఇప్పుడే ఇక్కడే నిరూపించు. ఒకవేళ, నువ్వు గనుక అది చేయలేకపోతే, ఇప్పటివరకూ నువ్వు సాధించిన పంచమహావరాలతో పాటు నీ తల కూడా భస్మీపటలమవుతుంద’ని దైవవాణి పూర్తిచేసేలోపునే.. రుద్ర మాట్లాడుతూ.. ‘తల్లీ.. 16 వేల మంది భార్యలు.. ద్వారకా నగరంలో 16 వేల రాజభవనాలు.. సతులతో పతి.. నారదుడికి దివ్యసాక్షాత్కారం’ అంటూ రుద్ర పూర్తిచేయకముందే.. ‘కాలాతీత ప్రయాణ వరం సాధించే మార్గం చెప్తున్నా.. జాగ్రత్తగా విను’ అంటూ దైవవాణి చెప్పడం ప్రారంభించింది. ఇంతకీ, రుద్ర ఏం చెప్పినట్టు??
సమాధానం
శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి, అతడి చెరలో ఉన్న 16,000 మంది రాకుమార్తెలకు విముక్తి ప్రసాదించాడు. అయితే, రాక్షసుడి చెరలో ఇన్నేండ్లు ఉన్న తమను సమాజం తిరస్కరిస్తుందని వాళ్లు వేడుకోవడంతో వారి కోరికమేరకు కృష్ణుడు వారిని వివాహం చేసుకొన్నాడు. వారికి ద్వారకా నగరంలో 16 వేల వేర్వేరు రాజభవనాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న నారద మహర్షికి ఒకే కృష్ణుడు 16,000 మంది భార్యలతో ఒకేసారి ఎలా మసులుకోగలడు? అనే సందేహం వచ్చింది. దీంతో ద్వారకకు ప్రయాణమై ఒక్కో రాజభవనాన్ని దర్శించగా.. అంతటా కృష్ణుడే కనిపించాడు. అంటే, భగవంతుడైన ఆ పరమాత్ముడు కాలాతీత ప్రయాణ సామర్థ్యంతో దీన్ని సాకారం చేశాడని అంటారు. అదే రుద్ర.. దైవవాణికి వివరించాడు.
– రాజశేఖర్ కడవేర్గు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

