కాంగ్రెస్‌కు ప్రమాణాలు ఢిల్లీకి, గల్లీకి జమీన్ ఆస్మాన్ పరఖ్ అన్నట్టుగా మారుతుంటాయి. దీనిని మనం ఒకే పార్టీ.. రెండు ముఖాలు అని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతామంటారు. తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం మోపుతారు! కాంగ్రెస్ ద్వంద్వవైఖరి మనకు అడుగడుగునా కనిపిస్తున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వీధుల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తారు, నినాదాలు చేస్తారు. పార్లమెంటు నుంచి జంతర్‌మంతర్ వరకు నిరసనలకు దిగుతారు. వాటిని ప్రజాస్వామ్య హక్కులుగా, రాజ్యాంగం ప్రసాదించిన నిరసన స్వేచ్ఛగా సమర్థించుకుంటారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్ సర్కార్ తన మీద ప్రశ్నలు సంధించేవారిని కేసులు, అరెస్టులు, నిర్బంధాలు, ఆంక్షలకు గురిచేస్తుంటుంది. హక్కులకు ఢిల్లీలో ఉండే నిర్వచనం తెలంగాణకు వచ్చేసరికి పూర్తిగా మారిపోతుందా? అనేది ప్రశ్న.
తెలంగాణలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏమైందని నిలదీస్తున్నది. పాలకుల అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నది. ప్రజలను అవస్థలపాలు చేస్తున్న చేవలేని, చేతగాని విధానాలను ఎండగడుతున్నది. కానీ ప్రశ్నించే నోర్లు మూయించడమే కాంగ్రెస్ సర్కార్ పనిగా పెట్టుకున్నది. అక్రమ కేసులు, అడ్డగోలు అరెస్టులతో వేధింపులకు పాల్పడుతున్నది. సోషల్ మీడియాలో నిరసన గళం వినిపించినా పోలీసు జులుం పరిపాటిగా మారింది. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను లక్ష్యంగా చేసుకుని ఖాకీల ద్వారా వేధింపులకు పాల్పడుతుండటం ఇందుకు తాజా ఉదాహరణ. కాంగ్రెస్ పాలకుల అక్రమాలపై ప్రశ్నించినందుకు కేసులు బనాయించి జైలుకు పంపాలని అస్మదీయులతో కేసులు పెట్టించింది.
కానీ రిమాండ్‌కు న్యాయస్థానం ఒప్పుకోకపోవడంతో కథ అడ్డం తిరిగింది. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ఎంతకైనా తెగిస్తామని, హక్కులను అణగదొక్కడంలో ఎంతవరకైనా దిగజారుతామని కాంగ్రెస్ పాలకులు చెప్పకనే చెప్తున్నారు. సామాన్యుల భావప్రకటనా స్వేచ్ఛ మీదా సర్కార్ విరుచుకుపడుతుండటం విడ్డూరం. హామీల గురించి బహిరంగంగా నిలదీసిన సామాన్యులనూ వదిలిపెట్టడం లేదు. తమ ఊరికి రోడ్డు వేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు చితకబాదడం ప్రభుత్వ అసహనానికి పరాకాష్ట. చివరకు గణేశ్ నిమజ్జనోత్సవంలో కేసీఆర్ పాటలు పెట్టుకున్నా ప్రభుత్వానికి నచ్చలేదు. డీజేలను లాక్కుని, అభిమానులను తరిమికొట్టడం పాలకుల నిరంకుశ ధోరణికి నిదర్శనం.
కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు ఉన్నట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తెలంగాణ ప్రజలకు కూడా ఉన్నది. ఢిల్లీలో ధర్నా ప్రజాస్వామ్య హక్కు అయితే హైదరాబాద్‌లో కూడా ప్రజాస్వామ్య హక్కే కదా. ఢిల్లీలో రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం రాజ్యాంగబద్ధమైన నిరసన అయితే, తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలపై నినదించే వారిని నేరస్తులుగా చూడటం ఏం న్యాయం? ప్రజాస్వామ్యానికి అసలు అర్థం అధికారంలో ఉన్నవారు చెప్పిందే ప్రజలు వినడం కాదు. ప్రజలు అడిగే ప్రశ్నలకు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పడం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వస్తే వాటిని వాస్తవాలతో తిప్పికొట్టాలి. ఆరోపణలు వస్తే విచారణకు సిద్ధపడాలి.
విధానాలపై వ్యతిరేకత ఉంటే ప్రజలకు వివరణ ఇవ్వాలి. అంతేకానీ విమర్శను ఎదుర్కోలేక పోలీసు కేసులను ఆశ్రయించడం ఏ రకం ప్రజాస్వామ్యం? దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతిపక్ష గొంతుకలను అణచివేస్తున్నారని, నిరసన హక్కును హరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. తమ పార్టీ నేతలపై కేసులు నమోదైతే వాటిని రాజకీయ వేధింపులుగా అభివర్ణించింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నది. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది కాంగ్రె స్. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రతిపక్షం, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తే.. ప్రతిప్రశ్నకూ ప్రభుత్వం ఓపికగా సమాధానం చెప్పాలి. ప్రభుత్వంపై విమర్శ చేయడానికి ప్రజలు ముందుకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడితే, ప్రజాస్వామ్యం కాగితాలపై మాత్రమే మిగులుతుంది.