తెలంగాణ తల్లి తన ఆత్మగౌరవ పోరాటం కోసం తానే స్వయంగా నియమించుకున్న న్యాయవాది, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. స్వరాష్ట్ర సాధనే తన ఊపిరిగా, తన జీవితానికి నిజమైన సార్థకతగా భావించి యావజ్జీవితాన్ని ఆ పవిత్ర కర్తవ్యానికే అర్పించిన మహోన్నత భావజాలయోధుడు ఆయన. ప్రాంతీయ వివక్ష వైఖరులను నిరంతర జాగరూకతతో విశ్లేషిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను చరిత్ర పుటల్లో ఆధారాలతో రికార్డు చేసిన ఆయన నిబద్ధత నిరుపమానమైనది. చివరి శ్వాస వరకు ఒకే కర్తవ్య దీక్షలో పయనించారు తప్ప.. ఏ కోశానా, ఎన్నడూ వెనుకంజ వేయలేదు. తన సత్యనిష్ఠతో, ధర్మదీక్షతో తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన తాత్విక, సైద్ధాంతిక భూమికను ఏర్పరిచి, తన నిజాయితీతో, నిస్వార్థ కృషితో, నిష్కళంక జీవితంతో కోట్లాది ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశారు.
నాడు నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ఆంధ్రా ప్రాంతానికి వలస వెళ్లిన తెలంగాణ వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను, బంధువుల నోట చిన్ననాడే విన్నారు జయశంకర్ సార్. తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్రా ప్రాంతం వారిలో వ్యక్తమైన చులకనభావం, వారి వ్యాపార మనస్తత్వం గురించిన తొలి ఎరుక ఆయనకు అట్లా చిన్నతనంలోనే కలిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మూడు దశల్లోనూ జయశంకర్ ఒక ఉద్విగ్న భాగస్వామి. 1952 ముల్కీ ఉద్యమానికి తొలి నిప్పుకణాలను రాజేసిన వరంగల్ మర్కజీ స్కూల్ విద్యార్థిగా ఆనాటి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ కాలేజీ సమావేశానికి బయలుదేరినప్పటికీ, భువనగిరి వద్ద బస్సు పాడయ్యి ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఆనాడు ప్రభుత్వం సిటీ కాలేజీ వద్ద జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు అమరులయ్యారు. ఆ అమరుల రక్తంతో తడిసిన అంగీని జెండాగా మలచి, నాటి విద్యార్థి ఉద్యమకారులు హైదరాబాద్ వీధుల్లో సాహసోపేతంగా ఊరేగింపు జరిపారు.
రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం, ఉద్యోగాల కోసం ఆరు దశాబ్దాలపాటు నెత్తురు ధారపోసిన దయనీయ చరిత్ర తెలంగాణది. ‘ఆ రోజు గనుక నేను సిటీ కాలేజీ కాల్పుల్లో మరణించి ఉంటే, తదనంతర కాలంలో తెలంగాణకు జరిగిన ఈ ఘోరమైన అన్యాయాలను చూసే నరకయాతన తప్పేది కదా‘ అని ఆయన అప్పుడప్పుడు తీవ్ర విషాదంతో గుర్తుచేసుకునేవారు. 1969 ఉద్యమం పెనుజ్వాలగా ఎగసిపడి, రాజకీయ ద్రోహానికి గురై అర్ధాంతరంగా ఆరిపోయినప్పుడు… ఆ నిరాశా నిస్పృహల దుఃఖంలో విలవిలలాడుతున్న యువ మేధావి జయశంకర్ సార్‌కు కర్తవ్య బోధ చేశారు నాటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రావాడ సత్యనారాయణ గారు. ‘ఆవేశం ఒక్కటే సరిపోదు, ఆలోచన కావాలి… సాక్ష్యాధారాలతో కూడిన సప్రమాణమైన వాదన కావాలి‘ అని ఆయన చేసిన మార్గదర్శనాన్ని శిరసావహించిన జయశంకర్ సార్, జీవితాంతం అసిధారావ్రతంలా అదే పంథాను కొనసాగించారు.
అంతులేని ఆవేదనతో అహర్నిశలూ జయశంకర్ సార్ చేసిన భావజాల రచనా కృషి, మలిదశ తెలంగాణ ఉద్యమానికి వజ్రసమానమైన పునాదిగా నిలిచింది. అది కుహనా సమైక్యవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసింది. ’కలిసి ఉంటే కలదు సుఖం’ అనే మాయమాటల వెనుక ఉన్న దోపిడీ కోణాన్ని బహిర్గతం చేసింది. ’నీళ్లు-నిధులు-నియామకాలు’ (ఈ చారిత్రక పదకల్పన కూడా ఆయనదే) అనే త్రివిధకోణాల్లో జరిగిన వివక్ష విశ్వరూపాన్ని పూసగుచ్చినట్టు వివరించారు.
జయశంకర్ సార్ చదివింది అర్థశాస్త్రమే అయినా… నీళ్ల దోపిడీని వివరించేటప్పుడు నిపుణుడైన ఇంజినీర్‌గా, నిధుల మళ్లింపుపై మాట్లాడేటప్పుడు ఆర్థికవేత్తగా, సాంస్కృతిక వివక్షను ఎండగట్టేటప్పుడు మహోన్నత భాషాకోవిదుడిగా, సాహిత్యవేత్తగా కనిపించేవారు. ఉర్దూ భాష పట్ల ఆయనకు ఎనలేని అభిమానం. ‘ఒక మత సాహిత్యం ఒక భాషలో ఉండవచ్చు… కానీ, ఆ భాషకు ఏ మతమూ ఉండదు‘ అని ఆయన పదేపదే చెప్పేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, హైదరాబాద్ సంస్థాన సంస్కృతీ విశాలత్వానికి, వైవిధ్యానికి, సహనశీలతకు, ఉదాత్త విలువల ఉన్నత మేధస్సుకు ఆయన నిలువెత్తు నిదర్శనం.
భావజాల రంగంలో జయశంకర్ సార్ చేసిన అపారమైన కృషికి బలమైన రాజకీయ వ్యక్తీకరణను ఇస్తూ, సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించి, ప్రజాఉద్యమాన్ని ఆశించిన గమ్యానికి చేర్చిన ఘనత నిశ్చయంగా కేసీఆర్‌దే. జయశంకర్ – కేసీఆర్‌ల మధ్య నెలకొన్న ప్రేమానురాగాలు, గౌరవానుబంధం తెలంగాణ పాలిట ఒక గొప్ప వరంగా భాసిల్లింది. దేశంలో 36 రాజకీయ పార్టీలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించి, మద్దతు లేఖలు సాధించడంలో వీరిద్దరి జోడీ కృషి లేకపోతే తెలంగాణ స్వప్నం సాకారమయ్యే అవకాశమే లేదనేది అక్షర స త్యం. చరిత్ర తెలియని కొందరు అ ల్పులు ఇప్పుడు రకరకాల కూతలు కూస్తూ వారిని కించపరచాలని చూస్తే, అది వారి మానసిక వైకల్య మే తప్ప ఆ ఇరువురు యోధుల కీర్తి వన్నె తగ్గదు.
కేసీఆర్ జయశంకర్‌ను ‘సార్’ అనిపిలిస్తే, జయశంకర్ కేసీఆర్‌ను ‘రావు సాబ్’ అని సంబోధించేవారు. నాటి టీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ వేదికపై ముందుగా జయశంకర్ పాదాలకు నమస్కరించే ప్రసంగం ప్రారంభించేవారు. వారిద్దరి మధ్య ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు ఎడతెగని చర్చలు సాగేవో! ఆ చర్చలలో భాగస్వామిని అయ్యే అరుదైన అనుభవం, అధ్యయన అవకాశం నాకు దక్కిన గొప్ప వరం. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ జయశంకర్ పట్ల అత్యున్నతమైన గౌరవాన్ని కనబరిచేవారు. జయశంకర్ అంతిమ ఘడియల్లో కేసీఆర్ సతీమణి శోభ చేయి పట్టుకుని, ‘అమ్మా! నీ చేతితో నాకు ఎన్నోసార్లు అన్నం పెట్టావు…‘ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్న దృశ్యం నాడు అక్కడ ఉన్నవారందరి హృదయాలను ద్రవీభవింపజేసింది.
ప్రజలు అనుభవించే కష్టాల వెనుక ఉన్న కారణాలను వివరించి, వారిని చైతన్యవంతులుగా మార్చడమే విద్యావంతుల విద్యుక్తధర్మమనే సూత్రాన్ని నమ్మి ఆచరించి చూపారు జయశంకర్ సార్. ‘ఆరు దశాబ్దాల పోరాటంలో తెలంగాణ ఉద్యమానికి విరామం సంభవించి ఉండవచ్చు కానీ, ఏనాడూ విరమణ జరగలేదు‘ అని ఆయన తన మేఘగంభీర స్వరంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. ఆయన తన కార్యాచరణకు కూడా ఏనాడూ విరమణ ప్రకటించలేదు. సిద్ధాంత వైరుధ్యాలను తాత్కాలికంగా పక్కనపెట్టి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు అందరూ కలిసి పోరాడాలని ఆయన కోరుకున్నారు.
అంతర్గత వలసవాదం అంతం కాకుండా తెలంగాణలో ఇతర సామాజిక లక్ష్యాలు నెరవేరవన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అన్ని రాజకీయ పక్షాలూ ఉమ్మడిగా తెలంగాణ కోసం ఉద్యమించాలనే ఆయన స్వప్నం నిజమవ్వడం తన జీవితకాలంలోనే ఆయన చూడగలిగారు. కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగా వచ్చిన డిసెంబర్ 9 ప్రకటన ఆయనకు అపరిమితమైన సంతృప్తినిచ్చింది. ‘మన జీవితాశయం నెరవేరబోతున్నది‘ అని ఆయన నాతో ఎంతో నమ్మకంగా చెప్పారు.
అయితే తెలంగాణ సిద్ధించిన శుభ ఘడియలో ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవడం తీరని లోటు. ఆయన అంతిమయాత్రకు జనప్రభంజనం తరలివచ్చింది. ఆయన పార్థివదేహాన్ని మోసే యాత్రలో తన భుజమిచ్చి కేసీఆర్ తన ప్రేమానురక్తిని చాటుకున్నారు. అనంతరం కేసీఆర్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జయశంకర్ సార్ జన్మస్థలం ఉన్న జిల్లాకు అధికారికంగా ’జయశంకర్ భూపాలపల్లి జిల్లా’గా నామకరణం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కూడా ఆయన పేరే పెట్టారు. అక్షరాన్ని నమ్మిన మేధావి ఎవరైనా ఒక సామాజిక లక్ష్యం కోసం రాజీలేని పోరాటం చేస్తే, కాలపరీక్షకు నిలబడుతూ నిబద్ధతతో సమరంలో నిమగ్నమైతే… ఏదో ఒకనాడు ఆ లక్ష్యం నెరవేరి తీరుతుందనే అమూల్యమైన సందేశాన్ని అందించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ నిజమైన అర్థంలో అమరుడు, సార్థక జీవుడు!
కేసీఆర్ జయశంకర్‌ను ‘సార్’ అనిపిలిస్తే, జయశంకర్ కేసీఆర్‌ను ’రావు సాబ్’ అని సంబోధించేవారు. నాటి టీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ వేదికపై ముందుగా జయశంకర్ పాదాలకు నమస్కరించే ప్రసంగం ప్రారంభించేవారు. వారిద్దరి మధ్య ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు ఎడతెగని చర్చలు సాగేవో! ఆ చర్చల్లో భాగస్వామిని అయ్యే అరుదైన అనుభవం, అధ్యయన అవకాశం నాకు దక్కిన గొప్ప వరం.