న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ (టెంపర్ గ్లాస్)ల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్నది. దేశంలో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్స్ను అమ్మడానికి ముందు ఆయా సంస్థలు రెగ్యులేటరీ అనుమతుల్ని పొందాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. దీనివల్ల నాసిరకం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ల అమ్మకాలకు బ్రేక్ పడుతుందని, విదేశాల నుంచి దిగుమతులు తగ్గి, స్వదేశంలో తయారుచేస్తున్న ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వంటి సంస్థలకు లాభిస్తుందని కేంద్రం భావిస్తున్నది.
‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ ఆర్డర్ 2021 నిబంధనలు స్మార్ట్ఫోన్ల స్క్రీన్ ప్రొటెక్టర్స్కూ వర్తిస్తాయి’ అంటూ సోమవారం విడుదలైన ఓ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కాగా, దీన్ని దేశీయంగా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ల ఉత్పత్తిని మొదలుపెట్టిన ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ స్వాగతించింది. చైనా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున భారత్‌లోకి నాసిరకం టెంపర్ గ్లాస్లు వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.