భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు. వివిధ కారణాలతో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లాలో ‘సర్’ పురోగతిపై గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు గడువు పొడిగించడంతో అదనపు సమయం లభించిందని అన్నారు.
దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 9,96,198 మంది ఓటర్లకు సంబంధించి 8,60,051 ఎన్యూమరేషన్ ఫారాలు (86.33 శాతం) డిజిటలైజ్ కాగా.. 1,29,263 ఫారాలు (12.93 శాతం) అన్- కలెక్టబుల్గా నమోదయ్యాయని చెప్పారు. దీంతో జిల్లాలో డిజిటలైజ్ చేసిన ఫారాలు, అన్ కలెక్టబుల్ కలిపి మొత్తం 9,89,314 ఫారాల ప్రక్రియ పూర్తయి.. 99.31 శాతం పురోగతి సాధించినట్లు వివరించారు. ఇంకా 6,884 ఫారాలు (0.69 శాతం) మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.