Shankarsinh Vaghela : గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు శంకర్సింహ్ వాఘేలా (Shankar Sinh Vaghela) తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పటేళ్లు (Patels), బనియాలు (Baniyalu), బ్రాహ్మణులు (Brahmins) పాకీ పనులు చేయాలని వాఘేలా వ్యాఖ్యానించారు. అలా చేస్తే తాను నెలకు రూ.50,000 వేతనంగా ఇస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
నర్మదా జిల్లాలోని సాగ్బారాలో ఈ నెల 2న జరిగిన ఆదివాసీ రైతుల సమావేశంలో వాఘేలా మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. అది ఎవరో ఇస్తున్న భిక్ష కాదని, దశాబ్దాలుగా అనుభవించిన వివక్షకు బదులుగా లభించిన హక్కు అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే పటేల్, బనియా, బ్రాహ్మణ సామాజిక వర్గాలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అయితే వాఘేలా వ్యాఖ్యలపై బీజేపీ, పాటీదార్, బ్రాహ్మణ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
బీజేపీ నేత, బ్రహ్మ సమాజ్ నాయకుడు యజ్ఞేశ్ దవే స్పందిస్తూ.. వాఘేలానే తన ఇంట్లో ఆ పని చేస్తే నెలకు రూ.5 లక్షలు వేతనం ఇస్తానని ప్రతి సవాల్ చేశారు. పాటీదార్ నాయకుడు అల్పేష్ కథీరియా కూడా వాఘేలా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాఘేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కార్యక్రమంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డాతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇదే సమయంలో శంకర్సింహ్ వాఘేలా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
2017లో పార్టీని వీడిన ఆయన.. బీజేపీని ఓడించేందుకు తిరిగి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమని ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన చర్చలు చివరిదశలో ఉన్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న గాంధీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేయనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగా.. కాంగ్రెస్లో ఆయన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.