హరిహర మాసం.. కార్తికం
భారతీయ సనాతన ధర్మంలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పర్వదినానికీ ఒక పరమార్థం ఉంది. అయితే కొన్ని మాసాలుకేవలం పండుగలకే పరిమితం కాకుండా, మనిషి జీవన విధానాన్ని,ఆలోచనా సరళిని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి.అలాంటి విశిష్టమైన మాసమే కార్తిక మాసం. శివారాధనకు, విష్ణుభక్తికి, దీపారాధనకు, తులసీ పూజలకు, ఉపవాసాలకు, దాన ధర్మాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఈ మాసం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
భారతీయ సనాతన ధర్మంలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పర్వదినానికీ ఒక పరమార్థం ఉంది. అయితే కొన్ని మాసాలుకేవలం పండుగలకే పరిమితం కాకుండా, మనిషి జీవన విధానాన్ని,ఆలోచనా సరళిని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి.అలాంటి విశిష్టమైన మాసమే కార్తిక మాసం. శివారాధనకు, విష్ణుభక్తికి, దీపారాధనకు, తులసీ పూజలకు, ఉపవాసాలకు, దాన ధర్మాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఈ మాసం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
కార్తిక మాసం అనగానే తెల్లవారు జామున నదీస్నానాలు, శివాలయాల్లో మారుమోగే రుద్ర నమక చమకాలు, ఆలయ ప్రాంగణాల్లో వెలిగే వేలాది దీపాలు, తులసికోట ముందు భక్తితో వెలిగించే ప్రమిదలు, కార్తిక సోమవార వ్రతాలు.. ఇలా ఒక నెల రోజుల వ్యవధిలో ఇన్ని నియమాలు పాటించమని ధర్మశాస్ర్తాలు సూచించడం వెనక అనేక ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి కార్తికం అని పేరు. కృత్తిక అంటే అగ్ని. దానిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మరూపం దీపం. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం.
కార్తిక మాసంలో వ్రతాలు, నోములతో పాటు దీపారాధనకు ప్రాధాన్యం ఉంది. కార్తికం అంటేనే దీపాల పండుగ. దీపం చీకట్లను దూరం చేస్తుంది. ఒక దీపం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. ‘అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతం గమయ..!’ బృహదారణ్యక ఉపనిషత్తులోని ఈ ప్రార్థన భారతీయ ఆధ్యాత్మిక పరంపరలో జ్యోతికి (దీపాల వెలుగుకు) ఉన్న అత్యున్నత స్థానాన్ని తెలుపుతుంది. సూర్యుడు ఈ మాసమంతా తులా-వృశ్చికరాశుల్లో కదులుతుండగా, పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో కార్తిక మాసంలో సూర్యకాంతి తగ్గి చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మానవుల శరీరమూ శక్తిని పుంజుకోలేక నీరసపడే సమయమిది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చీకట్లను పారద్రోలేందుకు ఉదయం పూట నెయ్యితో, సాయంకాలం నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీకగా అయిదు రుచులతో ఉండే ఉసిరికపైన దీపాన్ని వెలిగించడం ఈ మాసంలో ప్రత్యేకంగా భావిస్తాం. ఈ మాసంలో రెండు సంధ్యలలో దీపారాధన చేస్తారు. వాటిలో సాయం సంధ్యాదీపం విశేషమైనది. ఆ సమయంలో హరిహర ఆలయాల్లో కానీ, పూజా మందిరంలో కానీ, తులసి కోట దగ్గర కానీ దీప ప్రజ్వలన చేస్తారు.
కార్తికంలో కనిపించే మరో సంప్రదాయం ఎత్తైన ప్రదేశాల్లో వెలిగించే ఆకాశదీపం. ఇళ్ల వద్ద, ఆలయాల వద్ద ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆకాశం వైపు వెలిగే ఈ జ్యోతి విశ్వవ్యాప్తమైన దైవచైతన్యాన్ని స్మరించే ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ ఆకాశదీపాలను తులసి కోట పక్కన పొడవైన కొయ్య స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలకలపైన ఆకాశదీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తారు. ఇంటి గడప దగ్గర వెలిగించే దీపం కుటుంబ శ్రేయస్సును కోరుకుంటే, ఆకాశదీపం సమస్త లోక కల్యాణాన్ని ఆకాంక్షించే భావనకు ప్రతీకగా చూస్తాం. కార్తికంలో వెలిగించే దీపం సర్వ శ్రేయోదాయకమని, అలాగే ద్రవ్యాలను బట్టి చేసే దీపదానాలు కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడులోని తిరువణ్నామలై (అరుణాచలం)లో అరుణాచల పర్వతంపై వెలిగించే మహాదీపం శివుని అనంతజ్యోతికి ప్రతీక. పర్వత శిఖరంపై కనిపించే ఆ మహాజ్యోతిని దర్శించుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఒక చిన్న ప్రమిదలో ప్రారంభమైన జ్యోతి, ఒక పర్వత శిఖరంపై విశ్వాన్ని స్మరింపజేసే మహాజ్యోతిగా ఆవిష్కృతమవడం కార్తికమాస ఆధ్యాత్మిక వైభవానికి ప్రత్యక్ష నిదర్శనంలా కనిపిస్తుంది.

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా ఈ నెలను చెబుతారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు విశేష పూజలు చేస్తారు అందుకే ఈ మాసాన్ని హరిహర మాసంగా పిలుస్తాం. విష్ణు సహస్రనామ పారాయణం, సత్యనారాయణస్వామి వ్రతాలు, శివారాధన తప్పనిసరిగా చేస్తారు. ఈ మాసంలో మరో ముఖ్యమైన ఆచారం బిల్వార్చన, తులసీ పూజలు. మూడు ఆకులతో కూడిన బిల్వదళాన్ని పరమశివుడికి సమర్పించడం ఈ మాసం శివారాధనలో అత్యంత ప్రీతికరమైనది. ‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్.. త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్..’ అని బిల్వాష్టకంలో చెబుతాం. బిల్వ దళంలోని మూడు ఆకులను త్రిమూర్తులకు, త్రిగుణాలకు, శివుడి త్రినేత్రాలకు ప్రతీకలుగా వివిధ భక్తి వ్యాఖ్యానాలు వివరిస్తాయి. బిల్వదళాన్ని సమర్పించడం అంటే ప్రకృతి ప్రసాదించిన ఒక పవిత్రమైన కానుకను భగవంతుడికి అర్పించడం. ఇందులో భక్తి, వినయం, సమర్పణ భావం ప్రధానమైనవి.
ఇదే మాసంలో తులసీ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. విష్ణుభక్తి సంప్రదాయంలో తులసిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తికంలో శ్రీమహావిష్ణువుకు తులసీదళాలతో పూజచేయడం విశేష ఫలప్రదమని పురాణాలు పేర్కొన్నాయి. తులసి ప్రాశస్త్యం కేవలం పూజా విధానానికే పరిమితం కాదు. భారతీయ గృహ సంస్కృతిలో తులసి అత్యంత పవిత్రమైన జీవన సంప్రదాయం. కార్తిక మాసంలో తులసీ కల్యాణం ముఖ్యమైన వేడుక. తులసీ అమ్మవారికి, శ్రీమహావిష్ణువు స్వరూపమైన శాలగ్రామం లేదా శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తారు. ఈ వేడుక వెనక ఉన్న పురాణగాథ బృందాదేవి చరిత్రతో అనుసంధానమై ఉంటుంది. శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే భేదం లేకుండా కార్తిక దామోదరుడుగా విష్ణువును, రుద్రుడుగా పరమేశ్వరుని కొలుస్తాం. ఈ అద్వైత తత్వాన్ని లోకానికి చాటిచెప్పడంలో భాగంగా హరిహరసుతుడైన అయ్యప్పను ఈ మాసంలోనే విశేషంగా పూజిస్తారు. అటు శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం కలిగిన ఈ కార్తిక మాసంలో నదీస్నానం, దేవతార్చనం, సత్య నారాయణ వ్రతం, దీపారాధన, దీపదానం మొదలైనవి నియమనిష్ఠలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు, సకల శుభాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.
తెల్లవారుజామున నదీస్నానం మొదలు సాయంత్రం ప్రమిద వెలిగించే వరకు, తులసి కోట నుంచి శివాలయం వరకు, బిల్వ దళం నుంచి ఉసిరి వృక్షం వరకు ప్రతి ఆచారంలోనూ ఒక విశ్వాసం ఉంది. ప్రతి విశ్వాసం వెనకా ఒక తాత్తిక భావన నిగూఢంగా కనిపిస్తుంది. ఒక చిన్న ప్రమిదలో విశ్వతత్వం, ఒక తులసీదళంలో భక్తి పరిమళం, బిల్వపత్రంలో శివ రహస్యం.. ఇలా ప్రతీ ఆచారం వెనక అంతరార్థం.. అదే కార్తిక మాస రహస్యం. ఇక్కడ దీపం వెలుగు మాత్రమే కాదు.. జ్ఞానానికి ప్రతిరూపం, చెట్టు కేవలం వృక్షం కాదు జీవనాధారం, నది కేవలం ప్రవహించే నీరు కాదు జీవన సంస్కృతి. ఈ సమస్త ప్రకృతిలో ఒకే పరమతత్వాన్ని దర్శించడమే భారతీయ ఆధ్యాత్మికతలోని అంతరార్థం. అలాంటి ప్రకృతి ఆరాధనకు, అంతరంగ సాధనకు, దైవ చింతనకు ఒక ప్రత్యేకమైన వేదిక కార్తిక మాసం.
రంగనాథ్ మిద్దెల
9866573461
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

