Mandadi | కోలీవుడ్లో హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత తిరుగులేని మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరి. మరోవైపు విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటుడు సుహాస్ కలిసి నటించిన సినిమా ‘మండాడి’. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంలో, సంప్రదాయ పడవల పందెం చుట్టూ అల్లుకున్న ఈ సస్పెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మండాడి’కి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించింది. సూరి మాస్ అవతార్, సుహాస్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర, సముద్రం నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు, పడవల పందెం చుట్టూ సాగే ఉత్కంఠభరిత కథ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఈ ఏడాది కోలీవుడ్లో భారీ విజయాలను అందుకున్న చిత్రాల జాబితాలో ‘మండాడి’ కూడా చోటు సంపాదించింది. సముద్రం ఒడ్డున జీవించే మత్స్యకారుల జీవనం, వారి హక్కులు, గౌరవం, సంప్రదాయ పడవల పందెం చుట్టూ కథ సాగుతుంది. తన జాతి మనుగడ కోసం పోరాడే ముత్తుకాళి అలియాస్ కాళి పాత్రలో సూరి కనిపించారు. తన ప్రాంతానికి పెద్దదిక్కుగా నిలిచే మాచముని పాత్రలో సీనియర్ నటుడు సత్యరాజ్ నటించారు. ఇక సుహాస్ ఈ సినిమాలో సాట్టపులి అనే ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించారు. తీర ప్రాంతంలో చేపల వేటపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తూ.. కాళి బృందాన్ని దెబ్బతీయడానికి పలు వ్యూహాలు రచించే పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కాళి మాజీ ప్రేయసి ఏంజెల్, ఆమె భర్త సింగారం చుట్టూ ఉన్న పాత విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని సాట్టపులి చేసే మైండ్ గేమ్స్ కథలో ఆసక్తిని పెంచుతాయి.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘మండాడి’ డిజిటల్ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా థియేట్రికల్ రన్ పూర్తిగా ముగియకముందే ఓటీటీలోకి వస్తుందనే వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 8 లేదా 9వ తేదీ నుంచి ‘మండాడి’ని ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.అయితే ఓటీటీ విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.