జూలూరుపాడు, సెప్టెంబర్ 8: భారీ వర్షంతో జూలూరుపాడు మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాంపురం – ఏలకలొడ్డు గ్రామాల పరిధిలోని పశువులు, మేకలు, గొర్రెలను మేత కోసం వాటి కాపరులు శనివారం ఉదయాన్నే అడవికి తోలుకొని వెళ్లారు. ఆ తరువాత భారీ వర్షం కురువడంతో ఈ గ్రామాల సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించింది.
దీంతో 300 మేకలు అడవిలో చిక్కుకున్నాయి. వాటితోపాటు నలుగురు పశువుల కాపరులు, ఐదుగురు పోడు సాగుదారులు ఉన్నారు. వాగు దాటే అవకాశం లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై రాణాప్రతాప్ తన సిబ్బందితో కలిసి భారీ వర్షంలో వాగు వద్దకు చేరుకున్నారు. ఇవతలి ఒడ్డున పోలీసు వాహనాన్ని నిలిపి దాని లైట్ల వెలుతురులో తాళ్లు పట్టుకొని పోలీసులు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మొత్తం పశువులను, వాటి కాపరులను, పోడుసాగుదారులను సురక్షితంగా ఇవతలి ఒడ్డు తీసుకొచ్చారు.