బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే చేపట్టిన విషయం విదితమే. అయితే సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో వారు ఐదునెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా కులగణన సర్వేలో మొత్తం 4,608 మంది సిబ్బంది పాల్గొన్నారు. 481 గ్రామ పంచాయతీలు, 100 మున్సిపల్ వార్డుల్లో జరిగిన సర్వేలో 2,460 మంది ఎన్యూమరేటర్లు పాల్గొనగా ఆ వివరాలను సుమారు 1,800 మంది ఆపరేటర్లు కంప్యూటర్లో డాటా ఎంట్రీ చేశారు.
– అశ్వారావుపేట, మార్చి 7
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ సర్కార్ కులగణన సర్వే చేపట్టింది. గత ఏడాది నవంబర్ 9 నుంచి 24వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఇందుకు గాను మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లు, మెప్మా రిసోర్స్పర్సన్లు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఎంఆర్సీ సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా నియమించింది.
వీరంతా నిర్ణీత తేదీల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ప్రతి గ్రామంలోని కుటుంబాల వివరాలను సేకరించి ప్రత్యేకంగా అందించిన ఫాంలో నమోదు చేశారు. సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు మండల స్థాయి అధికారులను సూపర్వైజర్లుగా నియమించింది. ఎన్యూమరేటర్లు చేసిన సర్వేను పర్యవేక్షిస్తూ కుటుంబాల వివరాలను నమోదు చేసిన ఫారంలను తనిఖీ చేసి రోజూ వారీగా జరిగిన సర్వే వివరాలను సూపర్వైజర్లు ఉన్నతాధికారులకు నివేదించారు. అలాగే సర్వే వివరాలను వెబ్సైట్లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించింది.
కులగణన సర్వేలో పాల్గొనే సిబ్బందికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించింది. సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేలు, వెబ్సైట్లో కుటుంబ వివరాలు నమోదు చేసిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫాం నమోదు చేసినందుకు సుమారు రూ.25 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసినందుకు మీ సేవా కేంద్రాలకు రూ.15, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఆపరేటర్లకు రూ.5 చొప్పున చెల్లించింది. సర్వేకు ముందే ప్రభుత్వం ఫాంల ముద్రణ, ఇతర అవసరాలకు కొంత నగదు మంజూరు చేసింది.
సర్వే పూర్తై సుమారు ఐదునెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం పారితోషికం చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పారితోషికం చెల్లిస్తుందా లేదా అన్న ప్రశ్నలు సిబ్బందిని వెంటాడుతున్నాయి. చిరుద్యోగులమైన తాము ప్రభుత్వం ఇచ్చే పారితోషికం, వేతనాలపైనే ఆధారపడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారితోషికం నిధులు వెంటనే విడుదల చేయాలని ఎన్యూమరేటర్లు, డాటా ఆపరేటర్లు ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కులగణన సర్వే నిర్వహించాం. ఒక్కో ఫాం పూర్తి చేయటానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పట్టింది. సర్వే చేసినందుకు పారితోషికంగా రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పారు. అధికారులను అడిగితే ప్రభుత్వానికి నివేదించాం.. నిధులు వస్తాయంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాం.. దయచేసి మాకు ఇస్తానన్న పారితోషికం వెంటనే చెల్లించాలి.
-బీవీ సత్యనారాయణ, ఎన్యూమరేటర్, అశ్వారావుపేట
కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బందికి త్వరలోనే పారితోషికం చెల్లిస్తాం. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సర్వే సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కచ్చితంగా పారితోషికం చెల్లిస్తుంది.
-కొత్తూరి సంజీవ్‌కుమార్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కొత్తగూడెం