బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలతోపాటు పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలోని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే ఓ జిరాక్స్ సెంటర్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేశ్ మాట్లాడుతూ బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై గతంలో చాలా ఫిర్యాదు అందాయని, ఇందులో భాగంగానే తమ బృందంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ జరిగినట్లు గుర్తించడంతోపాటు కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించామన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా.. సోదాలు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న నవక్రాంత్ రూ.2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. ఈ ఘటన మరువకముందే మరోసారి ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, జిరాక్స్ సెంటర్లో తనిఖీలు నిర్వహించడంతో ఇంకా ఎంతమంది అధికారుల అవినీతి బండారం బయటపడుతుందోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.