ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 10 : ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్తు నిదర్శనం’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే బొక్కలో వేస్తారా?
‘రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే బొక్కలో వేస్తామని ఓటర్లను, ప్రతిపక్ష నాయకులను బెదిరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’ అని తాతా మధు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గెలుపునకు వెన్నుదన్నుగా నిలిచిన సీపీఐని సైతం టార్గెట్ చేయడం.. నమ్మక ద్రోహానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఇటీవలే సీపీఐ సీనియర్ నేత నారాయణ.. సదరు మంత్రి గురించి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా సీపీఐ శ్రేణులు ఆలోచన చేయాలని కోరారు. అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన మరో మంత్రి.. ఆనాడు వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాణం సమయంలో వ్యవస్థలు పని చేయలేదా? అని నిలదీశారు.
‘పొంగులేటి’ టెలీ కాన్ఫరెన్స్ బట్టబయలు..
ఏదులాపురం మున్సిపాలిటీలో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో నిబంధనలను తుంగలో తొక్కిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. స్థానికంగా పలు కాలనీల్లో నివాసం ఉంటున్న ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్ ఆడియోను ఎమ్మెల్సీ తాతా మధు మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న సొమ్ములతో ఉద్యోగులు జీతాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారడాన్ని తప్పుబట్టారు. ఆ పార్టీపై ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని హితవు పలికారు. అలాంటి వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారే విధులు నిర్వహిస్తే తోటి ఉద్యోగులతోపాటు ప్రజలను పక్కదారి పట్టించడంతోపాటు ఓట్లు తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఏజెంట్లుగా మారిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Khammam
రాజకీయాలకతీతంగా పనిచేశా: కందాల
పాలేరు నియోజకవర్గంలో తాను ప్రజలందరి కోసం పని చేశానని, రాజకీయాలకతీతంగా పనిచేశానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు, నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ప్రభుత్వ పథకాలు ఇస్తామని బెదిరించడం సమంజసం కాదని అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నాటి సీఎం కేసీఆర్ సహకారంతో తాను చేసిన అభివృద్ధి తప్ప.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా సాధించింది ఏమీ లేదని స్పష్టం చేశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ నేతలు షేక్ మక్బుల్, తాజుద్దీన్, బెల్లం వేణు, ముత్యాల వెంకటప్పారావు, బలుసు మురళీకృష్ణ, బంక మల్లయ్య, పగడాల నరేందర్, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ఉమ్మడి జిల్లాలో బుధవారం జరుగుతున్న మున్సిపల్ పోలింగ్.. బీఆర్ఎస్ ధర్మానికి, కాంగ్రెస్ అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ‘క్విడ్ ప్రో కో’ రాజకీయాలకు తెరలేపిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై రాష్ట్ర ఈసీకి, గవర్నర్‌కు ఫిర్యాదు అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.