ఖమ్మం, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల సన్మాన సభ సక్సెస్ అయింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సభ కోసం పార్టీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కేటీఆర్‌కు నీరాజనం పలికారు. సభలో కేటీఆర్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కేటీఆర్ చేసిన స్పీచ్‌కు, చేసిన విమర్శనాస్ర్తాలకు అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. గత కేసీఆర్ ప్రభుత్వం అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో, అప్పు ద్వారా చేసిన అభివృద్ధి ఏమిటో, అందించిన సంక్షేమం ఏమిటో కేటీఆర్ విపులంగా వివరించారు. రైతుబంధు సహా ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎన్నెన్ని నిధులు ఖర్చు పెట్టారో పొల్లుపోకుండా చెప్పడం సభికులను ఆకట్టుకుంది.
ఎన్నికల ముందు సీఎల్పీ లీడర్ హోదాలో గ్యారెంటీ కార్డుల పేరుతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి చేసిన రాజకీయ హంగామాను కేటీఆర్ చలోక్తులతో వివరించడం సభికులను ఆలోచింపజేసింది. సభా ప్రాంగణం కిటకిటలాడింది. అలాగే, కేటీఆర్ వస్తుండగా.. దారిపొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని అభివాదాలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేయడంతో సభికుల నుంచి హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఖమ్మానికి వచ్చిన కేటీఆర్‌కు పార్టీ జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. తొలుత, వందలాది బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.