భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీజెండాయేనని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్ స్కామ్‌ల పార్టీ అయిందని, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులూ రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఒక్క పథకం అమలు చేయలేకపోయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలకే రంగులు వేసి ప్రారంభించుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు రైతుభరోసా ఇవ్వలేక చేతులెత్తేసిందని, పండించిన వడ్లు కూడా కొనలేకపోయిందన్నారు.
వానకాలం వచ్చినా యాసంగి రైతుభరోసా ఇవ్వలేకపోవడం.. ఇంతకన్నా చేతకానితనం ఏదైనా ఉందా అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అమలుకాని హామీలిచ్చి అవి అమలు చేయలేక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారు. చివరికి అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదన్నారు. సింగరేణి కార్మికుల శ్రమను దోచుకొని, బొగ్గుబావులను ప్రైవేటుపరం చేసి కార్మికుల పొట్ట కొడుతుందన్నారు. చేతకాని ప్రభుత్వానికి తెలంగాణను పాలించే హక్కులేదని, ఓట్లు తొలగించడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ప్రజలు గమనించాలన్నారు. సర్ పేరుతో రివిజన్ చేసి ఇప్పటికే రెండు రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. ముఖ్యంగా బూత్‌లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించి, అర్హుల ఓట్లు తొలగించే కార్యక్రమానికి అడ్డుపడాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెంలో గొప్ప పేరున్న నాయకుడు వనమా వెంకటేశ్వరరావు అని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ సీటు ఇచ్చారని, ఆయన అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో బూత్‌లెవల్ ఏజెంట్లు దగ్గరుండి పనిచేస్తేనే ఓట్లు తొలగకుండా ఉంటాయన్నారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతున్నదని, అందువల్ల మహిళలను కూడా సమావేశాలకు తీసుకురావాలన్నారు. కొత్తగూడెంపై ప్రత్యేక దృష్టిపెట్టామని, ఇక్కడ ఎవరు పోటీచేసినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.
మాజీ మంత్రి వనమా మాట్లాడుతూ మనకు ఎలాంటి వర్గాలు ఉండకూడదని, అందరిదీ కేసీఆర్ వర్గమే కావాలని అన్నారు. మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను చూడడమే మన లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రత్యర్థులు నా కుమారుడు రాఘవను బదనాం చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు, దిండిగల రాజేందర్, వనమా రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, కార్పొరేటర్లు సింధు తపస్వి, వేల్పుల వీరమ్మ, గుణచరిత, సాగర్, రాంబాబు, మధు చందు, నాయకులు కాపు కృష్ణ, కొట్టి వెంకటేశ్వర్లు, శాంతి, సోనా, దామోదర్, రాజుగౌడ్, విశ్వనాధం, రామ్మూర్తి, నవతన్, శ్రీకాంత్, లావడ్యా సంపు, అనుదీప్, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.