భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, ఏప్రిల్ 11: ఈ నెల 27వ తేదీ మనకు పండుగ రోజని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఆ రోజున గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం భద్రాద్రి జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన.. తొలుత భద్రాచలంలో నిర్వహించిన బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరయ్యారు.
తరువాత కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. రేపోమాపో భద్రాచలంలో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఆ ఉప ఎన్నికలో కచ్చితంగా బీఆర్ఎస్ మరోసారి గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాచలం నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులమంతా దండుకడతామని స్పష్టం చేశారు. వరంగల్ సభ దిగ్విజయానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, రాంబాబు, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కృష్ణారెడ్డి, కణితి రాముడు, బోదెబోయిన బుచ్చయ్య, రేసు లక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గులాబీ దండుతో రజతోత్సవ సభ దద్దరిల్లాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమైన ఆయన.. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం వంటివి కేసీఆర్‌తోనే సాధ్యమని ఇప్పుడు నిరూపితమవుతోందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, సోనా, శాంతి, కొట్టి వెంకటేశ్వర్లు, ముంతపురి రాజుగౌడ్, అన్వర్‌పాషా, బత్తుల వీరయ్య, అంబుల వేణు, ప్రసాద్, పిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.