తిరుమలాయపాలెం, ఏప్రిల్ 17 : కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీళ్లు అందించే సీతారామ ప్రాజెక్టు కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనని స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం తిరుమలాయపాలెంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
27న సభకు వెళ్లేముందు అన్ని గ్రామాల్లోనూ బీఆర్ఎస్ దిమ్మెలపై గులాబీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సారథ్యంలో పాలేరు నియోజకవర్గం నుంచి పదివేల మంది వరంగల్ సభకు తరలేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలతోనే ఎక్కువ తిట్లు తింటున్న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్రకెక్కారని విమర్శించారు. కోర్టుల నుంచి వచ్చిన తీర్పులే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయని అన్నారు
పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై వరంగల్ సభలో అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. వరంగల్ సభను విజయవంతం చేసేందుకు వాల్‌పోస్టర్లు, గోడ రాతలు, జెండా పండుగలు చేపట్టాలని, వాటి ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, జిల్లాలో ముగ్గురు మంత్రులున్నప్పటికీ ఏ ఒక్కరూ ప్రజల్లో కన్పించడం లేదని, జిల్లా అభివృద్ధిని వదిలేసి కమీషన్ల వసూళ్లపై దృష్టిపెట్టారని విమర్శించారు. కృష్ణార్జునుల్లా హరీష్‌రావు, కేటీఆర్‌లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజులు మనవేనని, మన పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చూపిన చొరవ వల్లనే తిరుమలాయపాలెం మండలం సస్యశ్యామలమైందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుమునుపు కరువుపీడిత మండలంగా ఉన్న తిరుమలాయపాలేన్ని కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించారని గుర్తుచేశారు. అయితే, నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెందుతున్న వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే పనిచేస్తోందని; బీఆర్ఎస్ నాయకులైన ఇంటూరి శేఖర్, బాషబోయిన వీరన్నలతోపాటు మరికొందరిపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. చట్టాన్ని విస్మరించి తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడితే పోలీసులూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం రజతోత్సవ సభ పోస్టర్‌ను నేతలు ఆవిష్కరించారు. తరువాత మండలంలోని జల్లేపల్లి నుంచి బీఆర్ఎస్లో చేరిన అన్నెపర్తి ఉపేందర్, బోళ్ల సుధాకర్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ తిరుమలరావు సహా బీఆర్ఎస్ నాయకులు బాషబోయిన వీరన్న, బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, చావా వేణు, కొండబాల వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, ఏప్రిల్ 17 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నిధుల సేకరణకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మూటలు ఎత్తారు, మార్కెట్లో పనులు చేసి తమవంతుగా నిధులు సేకరించారు. మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు వివిధ షాపుల వద్ద బియ్యం బస్తాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు మోసి కూలి పనులు చేశారు. ఆయా దుకాణాల యజమానులు కూలి పనులు చేసినందుకు కొంత మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ తమ పార్టీ సభను పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిధులు సమకూర్చుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలి పనులు చేసినట్లు చెప్పారు.
ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడే ప్రసంగం వినేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. సభకు తరలివెళ్లే వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులపై ఉన్నదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా సభకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోశం నాగేశ్వరరావు, పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ కుంటా లక్ష్మణ్, నూకారపు రమేశ్, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, ముద్దంగుల కృష్ణ, యూసుఫ్, యాదగిరి గౌడ్, ఎడ్ల శ్రీను, ఆవుల నర్సింహారావు, రవి, జావీద్, సృజన్, రంజిత్, మహిళా కార్యకర్తలు జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.