మణుగూరు టౌన్/ఖమ్మం కమాన్బజార్/ఇల్లెందు రూరల్/సత్తుపల్లి, ఆగస్టు 1 : అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పార్టీ శ్రేణులు విమర్శించాయి. మహిళలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని ధ్వజమెత్తాయి. మహిళా శాసనసభ్యులపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశాయి. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం ఆందోళనలు చేపట్టాయి. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాయి.
మణుగూరులో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఖమ్మంలో పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మణుగూరులో రేగా కాంతారావు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇల్లెందులో హరిప్రియ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఖమ్మంలో పార్టీ నేతలు ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
అలాగే సీఎం దిష్టిబొమ్మను పార్టీ శ్రేణులు దహనం చేయబోగా పోలీసులు అడ్డగించారు. కార్యకర్తల వద్ద నుంచి దిష్టిబొమ్మను లాక్కొని పోలీసుల వాహనంలో వేసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఒక ప్రకటనలో ఖండించారు. సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి.. మహిళా సభ్యులను అవమానించడం, అందుకు డిప్యూటీ సీఎం భట్టి వంతపాడడం సిగ్గుచేటని విమర్శించారు.
మణుగూరులో జరిగిన నిరసనలో రేగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డిని శాసనసభ సాక్షిగా అవమానించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. ఇల్లెందులో హరిప్రియ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేని సీఎం ఉండడం దురదృష్టకరమని అన్నారు.
ఇప్పటి అసెంబ్లీ గౌరవ సభలా కాకుండా.. కౌరవ సభలా ఉందని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. సభానాయకుడిగా ఉన్నానన్న సోయికూడా లేకుండా రేవంత్రెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఖమ్మంలో పగడాల నాగరాజు మాట్లాడుతూ.. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని, మహిళా ఎమ్మెల్యేల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.