ఖమ్మం, జూలై 18: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి శుక్రవారం ఖమ్మం వచ్చిన కేటీఆర్.. మమత ఆసుపత్రి ప్రాంగణంలోని పువ్వాడ అజయ్ ఇంటి వద్ద జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తమపై, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకూ రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని ప్రతీ రంగాన్ని, ప్రతీ ఒక్కరినీ దారుణంగా మోసం చేసిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్నారు. ప్రజలను అన్ని రకాలుగా పీకుతింటున్న రేవంత్‌రెడ్డి సర్కార్ భరతం పడతామన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయం, సాగునీరు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, విద్య, వైద్యం, గిరిజన, దళిత, మైనార్టీ సంక్షేమం, అన్ని రంగాల సంక్షేమం కోసం పనిచేసి భారతదేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపామని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండేలా చేశామన్నారు. 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ.. 2018 నాటికి 88 సీట్లు గెల్చుకున్నదని, 2023లో ఆశించిన ఫలితాలు రాలేదని, అయినా ఇది కూడా మంచిదేనన్నారు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి 2023లో ప్రజలు వారికి అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలకు వారు చేసింది శూన్యమన్నారు. బోగస్ మాటలు చెబుతున్న మంత్రులు రైతులకు బోనస్ మాత్రం వేయడం లేదన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను పిలిపించి యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులను బురిడీ కొట్టించారని, ఫ్రీ బస్సు, నెలకు రూ.2,500, తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను దగా చేశారని, పెద్దమనుషుల్లో ఇద్దరికీ నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని వాళ్లను కూడా ఘోరంగా మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు.