తిరుమలాయపాలెం, మే 1: ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. మండలంలోని కాకరవాయి, పిండిప్రోలులో బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన రుణమాఫీ, కల్యాణలక్ష్మికి తులం బంగారం, ఆసరా పింఛన్ల పెంపు తదితర పథకాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఐదు ఎకరాల ఉన్న రైతులకు సైతం ఇప్పటివరకూ రైతుబంధు ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరువు తీసుకొచ్చిందని, కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ నేడు కరువు కాటకాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. నాలుగు నెలల్లో చేసింది శూన్యమని అన్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నామా నాగేశ్వరావుకు ఓటు వేస్తే నాకు వేసినట్లేనని, స్థానికుడైన నామాను గెలపించి నాన్ లోకల్ వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, నాయకులు ఆలిస్యం నాగేశ్వరరావు, వీరబోయిన మౌనిక, శ్రీనివాస్, చామకూరి రాజు, కొండబాల వెంకటేశ్వర్లు, పరికపల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, మే 1: బీఆర్ఎస్తోనే యావత్ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని, పార్లమెంట్ ఎన్నికలల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని యం.వెంకటయపాలెం, పెద్దతండా పంచాయతీల్లో మాజీ ఎమ్మెల్యే కందాళ్డ ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలంగాణ హక్కులు, ప్రజల సమస్యల కోసం పార్లమెంట్లో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. నిరంతరం ప్రజలకు అండగా ఉండేది గులాబీజెండా మాత్రమే అన్నారు.