ఖమ్మం, ఆగస్టు 14 : భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ మానసపుత్రిక అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఆయనే స్వయంగా రూపకల్పన చేసి నిర్మించిన ఎత్తిపోతల పథకం సీతారామ అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీలేదని స్పష్టం చేశారు. కానీ.. కేసీఆర్ నిర్మించిన ఈ ప్రాజెక్టును వారి ప్రభుత్వం నిర్మించినట్లుగా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చెప్పుకుంటుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరాలో గురువారం జరిగే సభలో సీఎం రేవంత్‌రెడ్డి సీతారామ ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పులు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ మంత్రులు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కానీ.. హరీశ్‌రావు మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు.
‘సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ చేసిందెవరు? కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులెన్ని? ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఎంత? కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఎంత? సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న మూడు మోటర్లు బిగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా? కాంగ్రెస్ ప్రభుత్వమా?’ వంటి అనేక విషయాల గురించి ఉమ్మడి జిల్లా ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసినట్టుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు.. ఉమ్మడి జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీ హామీలకూ దికులేదని తాతా మధు విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఆ మరుసటి నెల నుంచే పెంచిన పింఛన్‌ను కలిపి ఒకేసారి పంపిణీ చేస్తే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 8 నెలలు అవుతున్నా పింఛన్లు పెంచకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు.
అనేక బృహత్తర పథకాలను అటకెకించిందని ఎద్దేవా చేశారు. ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 40 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదని విమర్శించారు. కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తాము చేసినట్లుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు.. బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేయడంలో ఏకంగా గోబెల్స్‌నే మించిపోయారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టును తాము పూర్తి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బెల్లం వేణు, ఉప్పల వెంకటరమణ, పగడాల నాగరాజు, తాజుద్దీన్, పగడాల నరేందర్ పాల్గొన్నారు.