మణుగూరు టౌన్, మార్చి 22 : గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రార్టర్లకొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు మణుగూరు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. తొలుత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి రేగా ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ ప్రధాన సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలు ఇసుక అక్రమ రవాణా, తమకు కలిగే ఇబ్బందుల గురించి రేగాకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, పాల్వంచ, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, మణుగూరు మండలాల్లో గోదావరి, కిన్నెరసాని, పెదవాగు నదులపై పెద్ద ఎత్తున ఇసుక తోలకాలు జరుగుతున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదన్నారు. దీనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అక్రమార్జనే ధ్యేయం 12 లారీలను బినామీ పేర్లతో నడిపిస్తూ ఇసుక రవాణా జోరుగా సాగిస్తున్నారని ఆరోపించారు. స్థానికులు తమ అవసరాల కోసం ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తే అధికారులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అర్ధరాత్రి పొక్లెయిన్లతో కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో తోలే ఇసుక రవాణా అధికారులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి.. కాంగ్రెస్ నాయకులకు దోచిపెట్టే పనిలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పోషం నర్సింహారావు, అడపా అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, వట్టం రాంబాబు, మధు, రవి, కోటి, నూకారపు రమేశ్, నర్సింహారావు, రంజిత్, యాదగిరిగౌడ్, రాహుల్, సృజన్, రమాదేవి, జ్యోతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.