ఖమ్మం రూరల్: ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపుమేరకు ఎదులాలాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయుడుపేట రింగ్ రోడ్ సెంటర్లో మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థల బాధ్యులు, సోషల్ మీడియా వారియర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవరంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
అ సందర్భంగా బెల్లం వేణు మాట్లాడుతూ.. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు పడ్డ బాధలు వర్ణనాతీతమని చెప్పారు. స్వరాష్ట్ర సాధన తర్వాత నాటి సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావడంతోభారతదేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మాణం కోసం కేసీఆర్ రేయింబవాళ్ళు శ్రమించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. నిరంతరం రైతులు, వ్యవసాయ రంగంపై ఆలోచన చేసే కేసీఆర్ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద విషం కక్కుతున్న కాంగ్రెస్ తీరును యావత్ తెలంగాణ సమాజం నిశితంగా పరిశీలిస్తుందని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండపల్లి వరప్రసాద్, భానోత్ కృష్ణ, ముత్య అక్కినపల్లి, వెంకన్న, పేరం వెంకటేశ్వర్లు, దర్గయ్య జరుపుల, లక్ష్మణ్ నాయక్ ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.