పెనుబల్లి, మే 9: విగ్రహావిష్కరణ అనంతరం సభావేదికపై ఆసీనులైన వెంటనే ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించాలని పిలుపునివ్వడంతో వేదికపై ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహ సభకు హాజరైన ప్రజలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజలు మోసపోయారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. రాయల శేషగిరిరావు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు.
– ఎంపీ వద్దిరాజు
ప్రజలకు అండగా ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, వారి కోసం ఎంత లెక్కైనా, ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమని పార్టీ ఖమ్మంజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని ఆయన మాటలు వినేందుకు, ఆయనను చూసేందుకు ఇంతమంది ప్రజలు సభకు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రం సాధించిన కేసీఆర్‌పైనే ఉందన్నారు.
– ఎమ్మెల్సీ తాతా మధు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాయల శేషగిరిరావును జిల్లా నాయకులు మానసిక క్షోభ పెట్టారని, ఆ మనోవేదనతోనే ఆయన మృతిచెందారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన ఘనత రాయలదే అని, అధికారం కోసం కాదు, ప్రజల నమ్మకం కోసం పనిచేయాలనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణకు రామన్న రావడం అదృష్టమన్నారు.
– మాజీ మంత్రి పువ్వాడ
తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ర్టాన్ని సాధించి పదేళ్లపాటు దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్ స్థానంలో ఉంచిన మహానేత కేసీఆర్ వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దీనికి నిదర్శనం మొన్న జరిగిన వరంగల్ బహిరంగసభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ ప్రసంగం, ఆయన దర్శనం కోసం రావడమేనన్నారు. రాబోయే కాలమంతా బీఆర్ఎస్దే అని, ప్రతిఒక్కరూ ధైర్యంగా ఉండాలన్నారు.
– మాజీ ఎమ్మెల్యే సండ్ర