ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను నిద్రపోనియ్యమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎటు పోయాయని నిలదీశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీల అమలులో జాప్యం ఎందుకని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీ పథకాలపై సంతకాలు చేసి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం ఆ పార్టీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో రేవంత్, భట్టిపై ఫిర్యాదులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేశారు.. వినూత్నంగా నిరసనలు తెలిపారు. ‘ఓడ ఎక్కేదాక ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య’ అన్నట్లు ఉందని కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపక్షాన నిరంతరం పోరాడుతామని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడ ఎండగట్టారు.
–మణుగూరు టౌన్/ కొత్తగూడెం అర్బన్/ ఇల్లెందు, ఏప్రిల్ 1
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. మణుగూరు పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేశారు. పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమలుకాని ఆరు గ్యారెంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 15 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల్ని మోసం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. కొత్తగూడెం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఫిర్యాదు అందజేశారు. వనమా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కొత్తగూడెంలో ర్యాలీ చేసి కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి ఇల్లెందు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందజేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం, డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేయాలని ఎస్సై సందీప్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమల్లో ఆయా మండలాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.