బోనకల్లు/ ముదిగొండ/ పెనుబల్లి/ కూసుమంచి(నేలకొండపల్లి), ఏప్రిల్ 9 : పంట చేతికొస్తున్న క్రమంలో ఊరూరా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం వినతిపత్రాలు సమర్పించారు. బోనకల్లులో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, రైతులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న పంట పండించిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
పంట చేతికొస్తున్న తరుణంలో దళారులకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పండించిన ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందేలా చూడాలని, 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ మద్దెల రమాదేవికి వినతిపత్రం అందజేశారు. నేలకొండపల్లి మండలంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ రాంప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, నాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు సత్యనారాయణ, తిరుమలాపురం సర్పంచ్ కామదానం ప్రవీణ్, నాయకులు మరికంటి రేణుబాబు, వార్డు సభ్యులు లింగయ్య, ఈశ్వరి, హుస్సేన్ ఆదాం, ప్రశాంత్, కిశోర్ ఉన్నారు.
ముదిగొండ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, సామినేని హరిప్రసాద్, పోట్ల ప్రసాద్, బంక మల్లయ్య, ఏలూరు రమేశ్, కోడే బాబు, కనగాల వెంకటేశ్వర్లు, నూక లింగస్వామి, లాలయ్య, మరికంటి శ్రీను, ఆనందరావు, నరసింహమూర్తి, పొనుకుల కోటేశ్ తదితరులు ఉన్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కట్టా అజయ్‌బాబు, పెడకంటి రామకృష్ణ, మేకల కృష్ణ, సయ్యద్ రవూఫ్, నందిగామ ప్రసాద్, కిరణ్, కొరకొప్పుల ప్రసాద్, కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.