ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతాంగానికి గుండెకాయలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని, రాష్ర్టానికి ఈ ప్రాజెక్టు వల్ల చేకూరుతున్న ప్రయోజనాన్ని ప్రజలకు చాటిచెబుతామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గళమెత్తాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండోరోజు మంగళవారం ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించి స్వరాష్ట్రం సాధించిన అపర భగీరథుడు కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అసత్య ఆరోపణలు చేస్తున్నదని, తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించేందుకు బీజేపీతో చేతులు కలిపిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను టార్గెట్ చేశారని విమర్శించారు. ప్రజలు వారి కుట్రలను ఏమాత్రం సహించరని, రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు బంగారుపాలన అందించారన్నారు.
ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం నీళ్లులేక భూములు సేద్యానికి నోచుకోక ఎడారిగా మారిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కొంతకాలానికే ప్రాజెక్టులు కట్టి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన కట్టిన అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కపటనాటకాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ విచారణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతారని గ్రహించిన రేవంత్‌రెడ్డి ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. లక్షలాది ఎకరాల బీడు భూములకు నీరందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆయా మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో పోలీసులు బలవంతంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లకు తరలించారు.