బూర్గంపహాడ్, ఏప్రిల్ 6: శ్రీరామనవమిలో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ సహా సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, మాలమహానాడు నాయకులను శనివారం అర్ధరాత్రి పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. గ్యారెంటీ హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తారేమోనని, సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటారేమోననే అనుమానాలతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, భద్రాచలంలోని సీతారాముల కల్యాణంలో పాల్గొన్న అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడైన గిరిజనుడు బూరం శ్రీనివాసరావు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సారపాకకు వచ్చే షెడ్యూల్ ఉంది. ఆయన సారపాకకు వచ్చిన క్రమంలో బీఆర్ఎస్ నేతలు, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, మాలమహానాడు నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడతారన్న భయంతో ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బూర్గంపహాడ్ మండలంలోని ఆయా నేతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత వారిని భద్రాచలం పోలీసు స్టేషన్‌కు, అక్కడి నుంచి కిన్నెరసానిలో ఉన్న పాల్వంచ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.
ఆరు గ్యారెంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఓటెసి గెలిపించిన ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్, వామపక్ష నేతలు విమర్శించారు. పాలనా పగ్గాలు చేపట్టి 15 నెలలు దాటినా హామీలు అమలుచేయకుండా కాలయాపన చేస్తోందని, తాజాగా సన్నబియ్యం పేరిట ఆర్భాటాలు చేస్తూ హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, కొనకంచి శ్రీను, బెజ్జంకి కనకాచారి, చల్లకోటి పూర్ణచందర్రావు, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, పంగి సురేశ్, సీపీఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, గడ్డం స్వామి, వెంకట్రావు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు కెచ్చెల రంగారెడ్డి, మాలమహానాడు నాయకుడు అల్లాడి పౌల్రాజ్ తదితరులు ఉన్నారు.