నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. గ్రామాల్లోని సైడు కాల్వల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు కూడా లేదని దుయ్యబట్టారు. వర్షాలు మొదలై పల్లెల్లో పారిశుధ్యం లోపిస్తున్నా నివారణకు తీసుకున్న చర్యలు లేవని ధ్వజమెత్తారు. పల్లెల్లోని సమస్యలను పరిష్కరించాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సోమవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఆయా సమస్యలపై అక్కడి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర దాటినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. పాలకవర్గాలు లేని కారణంగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించకపోవడం, మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం, చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించకపోవడం వంటి కారణాలతో పల్లెల్లో పారిశుధ్యం లోపించిందని ధ్వజమెత్తారు.
దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో పల్లెల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. వీటి నివారణ కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని దుయ్యబట్టారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకత లేదని, జాబితాల నిండా అనర్హులేనని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని దుమ్మెత్తిపోశారు. దోమల నివారణకు చర్యలు లేక, వీధుల్లో వీధి దీపాలు వెలుగక, పారిశుధ్య పనులు ముందుకు సాగక.. భద్రాద్రి జిల్లాలో పల్లెల దుస్థితి గడిచిన 18 నెలలుగా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకపోతే ఈ సర్కారును ప్రజలు సాగనంపక తప్పదని తేల్చిచెప్పారు. అనంతరం ఆయా కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఇల్లెందులో అక్కడి మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, ఉద్యమనేత దిండిగాల రాజేందర్, కొత్తగూడెంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నేత మానే రామకృష్ణ తదితర ముఖ్య నేతలు అందజేశారు.