Rega Kantharao | గుండాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 13 మాసాలు గడిచినా ఇప్పటికి పథకాలు అమలుకు నోచుకోలేదని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. శనివారం గుండాల మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప కొత్తగా నియోజకవర్గానికి ఒక్క పైసా మంజూరు చేయలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పథకాల్లో కోత విధించడమే తప్ప కొత్తగా వీరు సాధించింది ఏమీలేదని అన్నారు.
నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రేగా కాంతారావు అన్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడు ఎరుగు కానీ గతంలో అమలైన పథకాలైనా అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో కుంటుపడిందని గాడిన పెట్టాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమన్నారు. గ్రామ సభల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారే తప్ప వాటితో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.
గ్యారంటీ పత్రం ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఇంటికి ఇచ్చారని పథకం అమలు చేయాల్సి వస్తున్నప్పుడు మాత్రం మండలానికి ఒక గ్రామానికి అందులో కొంతమందికే అమలు చేస్తున్నారని రేగా కాంతారావు ఆరోపించారు. ఎన్నికల కోసమే బూటకపు హామీలు ఇచ్చారే తప్ప అమలు చేయడానికి కాదని చెప్పారు. రానున్న ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ ఏ గ్రామంలోనైనా పూర్తిస్థాయిలో అమలైందని నిరూపించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గుండాల మండలం అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రైతు సమన్యాసం తి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, ఉపాధ్యక్షులు కటికం నాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ సీనియర్ నాయకులు వట్టం రవి, గడ్డం వీరన్న, గుగ్గిల రాంబాబు, జాడి ప్రభాకర్, పొంబోయిన సుధాకర్, తాటి కృష్ణ, బొమ్మెర శ్రీను, లక్ష్మీనరసు, మల్లయ్య, ముఖ్య శ్రీను, పద్మారావు, మహేందర్, లక్ష్మయ్య, బొమ్మెర్ల సతీష్, బొకే వీరు, సీహెచ్ వీరన్న, వెంకన్న, కాలే, హరి తదితరులు పాల్గొన్నారు.