కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 8: ఎన్నికల హామీలను అమలుచేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతామని, అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. 108 అంబులెన్స్‌లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలకు కాంగ్రెస్ పాలకులు పాతరేస్తున్నారని విమర్శించారు. కమీషన్లు దండుకొని వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీలో డబ్బు సంచులతో దొరికిన రేవంత్‌రెడ్డి.. ఆ తరువాత ఆ పార్టీని బొందపెట్టారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఈ పార్టీని కూడా రాష్ట్రంలో భూస్థాపితం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా, నిధులు కేటాయించని కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచి పేదలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కనీసం డీజిల్ కూడా లేక 108 అంబులెన్స్ వాహనాలు మూలకు పడ్డాయని, ఫీజు రీయింబర్స్మెంట్ అందక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, బెస్ట్ అవైలబుల్ పిల్లలను ప్రైవేటు స్కూళ్లు వెళ్లగొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కొంత చెల్లిస్తామని, మార్చి తర్వాత ప్రతి నెలా కొంత కొంత చెల్లిస్తామని ప్రైవేటు కళాశాలల యజమానులకు హామీ ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించలేదని విమర్శించారు. ఫలితంగా ప్రైవేటు కాలేజీల యజమానులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు ఇవ్వలేమంటూ ఏకంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి చాంబర్ ఎదుటే కాంట్రాక్టర్లు ధర్నా చేయడమంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల దందా ఏ విధంగా సాగుతుందో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.
అందుకే భట్టిని వాయిదాల మంత్రిగా, వాటాల మంత్రిగా కాంట్రాక్టర్లు బహిరంగంగానే పిలుచుకుంటుండడం సిగ్గుచేటని అన్నారు. గురుకులాల్లో విద్యార్థుల మరణమృదంగానికి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు మంగళం పాడడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకూ రోజూ ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని దుయ్యబట్టారు. యూత్ డిక్లరేషన్ పేరిట యూత్‌ను మాయ చేశారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రతీకార, పైశాచిక పాలన చేస్తుంటే.. కాంగ్రెస్‌లో అతడే మొదటి, చివరి ముఖ్యమంత్రి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలు తొగరు రాజశేఖర్, సంకుబాపన అనుదీప్, జయరాం, మునీర్, రిజ్వాన్, భూపతి శ్రీనివాస్, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.