నా పేరు బోడ బాలు. మాది టేకులపల్లి మండలం బోడ బంజర్. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాన్నను ఎటు వెళ్తున్నావు అని అడిగితే.. పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్తున్నా అనేవారు. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్పేవారు. అంటే.. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక నిత్యం పొలం వద్దే ఉండేవారు. అప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉండేది. ఇప్పుడు నాకు 42 ఏళ్లు వచ్చినయి. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మాకు కాంగ్రెస్ పాలన అవసరం లేదు.
– రైతు బాలునాయక్
రఘునాథపాలెం, జూలై 18: కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అందుకే తదుపరి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ పీసీసీ చీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిరసనగా.. ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం’ పేరుతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మండలంలోని వీ వెంకటాయపాలెం రైతు వేదికలో మంగళవారం ఏర్పాటుచేసిన రైతు సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు వద్దంటున్న కాంగ్రెస్‌కు, 3 గంటల కరెంటు చాలంటున్న రేవంత్‌కు వచ్చే ఎన్నికల్లో రైతులందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తుండడాన్ని తట్టుకోలేని రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నాడని అన్నారు. పవర్ హాలిడేలతో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన పాపం కాంగ్రెస్‌దేనని విమర్శించారు.
ధైర్యముంటే 3 గంటల కరెంటు చాలనే అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు రావాలని రేవంత్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా స్పందించకుంటే రానున్న రోజుల్లో రైతులను ఆదుకునే ప్రభుత్వమే కనిపించదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మళ్లీ చీకట్లోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్రం, రైతులు, పేదలు అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ముందుగా వీవీపాలెం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును మంత్రి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, పునకొల్లు నీరజ, దోరేపల్లి శ్వేత, అఫ్జల్, పగడాల నాగరాజు, రావెళ్ల మాధవి, యరగర్ల హనుమంతరావు, తొలుపునూరి దానయ్య, జంగాల శ్రీను, మూడ్ వెంకన్న, మాళోతు రమేశ్, కుతుంబాక నరేశ్ తదితరులు పాల్గొన్నారు.