భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ వచ్చింది. అయితే, ఏటికేడు నూతన విద్యాసంవత్సరంలో కొత్త విద్యార్థులు వస్తుండడంతో వారికి అనుగుణంగా సౌలత్లు కల్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ విషయంలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో వైద్య విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్య విద్యను అభ్యసించాల్సి వస్తున్నది. కనీసం సదుపాయాల దగ్గర నుంచి మొదలుకొని వైద్య విద్యాభ్యాసం వరకూ అన్నింటా సమస్యలకు వారు ఎదురీదాల్సి వస్తున్నది.
పోరాడి సాధించుకున్న తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకూ వైద్య విద్యను, నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయాలని సంకల్పించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. 2021లో భద్రాద్రి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రిన్సిపాల్‌ను నియమించారు. 2022 నుంచి వైద్య విద్యార్థుల తొలి బ్యాచ్ వచ్చింది. వీరికోసం అప్పటికే పాల్వంచ సమీపంలో ఓ కాలేజీ భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా 150 మంది విద్యార్థులు ఈ కాలేజీలో సీట్లు పొందుతూ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ప్రభుత్వ వైద్యశాలను కూడా అప్‌గ్రేడ్ చేయడంతో జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం కూడా అందుతున్నది. అయితే, ఏటా వస్తున్న విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది.
ఈ కారణంగా ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. త్వరలో రాబోయే బ్యాచ్ విద్యార్థులకు కూడా సమస్యలు తప్పేలా లేవు. కాలేజీ భవనాలు, హాస్టల్ భవనాల నిర్మాణంపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో అవి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ హాస్టల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో నేటికీ చాలీచాలనీ గదుల్లోనే ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులు బస చేయాల్సి వస్తున్నది. ఇక 2023 ప్రారంభంలో కొత్తగూడేనికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేసింది. అయితే, ఐదున్నరేళ్ల వైద్య విద్య కోర్సుకు సంబంధించిన సదుపాయాలను కల్పిస్తూ అప్పటికే నిర్మించిన వైద్య కళాశాల భవనం పక్కనే రూ.200 కోట్లతో బహుళ భవనాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది.
అవి పూర్తయితే.. మొదటగా నిర్మించిన, వైద్య కళాశాల కొనసాగుతున్న భవనాన్ని నర్సింగ్ కాలేజీకి అప్పగించి.. కొత్తగా నిర్మించే బహుళ భవనాల్లోకి వైద్య కళాశాలను మార్చాలని అప్పటి ప్రభుత్వం సంక్పలించింది. కానీ.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా బహుళ భవనాల నిర్మాణాలను పూర్తిచేసేందుకు శ్రద్ధ చూపడం లేదు. దీంతో, మొదటగా నిర్మించిన వైద్య కళాశాల భవనం అందులోనే కొనసాగుతున్నది. ఇందులోకి రావాల్సిన నర్సింగ్ కాలేజీ.. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్నది.
అయితే, వైద్య కళాశాల కోసం చేపట్టిన బహుళ భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి అన్ని సౌకర్యాలూ కల్పిస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ.. ఆ దిశగా రేవంత్ సర్కారు దృష్టి సారించకపోవడంతో ఇటు వైద్య విద్యార్థులకు, అటు నర్సింగ్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కొత్తగూడెం, పాల్వంచల్లోని ప్రైవేటు హాస్టళ్ల నుంచి ఆటోల్లో వస్తున్న కొందరు వైద్య విద్యార్థులు ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడ్డారు.
పూర్తిస్థాయి ఫ్యాకల్టీతో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు వైద్యవిద్యనందించింది బీఆర్ఎస్ సర్కారు. అయితే, ఏటా వస్తున్న అడ్మిషన్లకు అనుగుణంగా అదనంగా నియమించాల్సిన ఫ్యాకల్టీపై.. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. దీంతో ఏటా వైద్య విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అందుకు అనుగుణంగా ఫ్యాకల్టీ పెరగడం లేదు. దీంతో వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు.
కొత్తగూడెం వైద్య కళాశాలకు ఇంకా పదిమంది ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 32 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 18 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కావాల్సి ఉంది. 22 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు లేక విద్యార్థులకు సరైన సదుపాయాలు అందడం లేదు. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌ల్లో కలిపి 449 మంది వైద్య విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. త్వరలోనే మరో 150 మంది విద్యార్థులతో ఇంకో బ్యాచ్ రాబోతోంది. వీరు కూడా వస్తే ఫ్యాకల్టీ ఇంకా అవసరమవుతుంది. సౌకర్యాలు లేక వారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే, కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల తనిఖీలకు త్వరలోనే వైద్య విద్యా విభాగం(డీఎంఈ) అధికారులు రానున్నారు. వసతుల కల్పన సమస్యలపై వారు ఎలా స్పందించారో చూడాలి.