అశ్వారావుపేట/ పెనుబల్లి, సెప్టెంబర్ 1: పొదుపు పంఘాల ఆర్థిక, ఇతర అంశాల్లో మహిళలకు చేదోడు వాదోడుగా సేవలందిస్తున్న సహాయకుల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సంస్థ సహాయకుల (వీవోఏ) వేతనాన్ని ఏకంగా రూ.8 వేలకు పెంచింది. ఆ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయటంతోపాటు డ్రెస్ కోడ్ అమలుకు కూడా నిధులు కేటాయించింది. బీమా సౌకర్యం కల్పించేందుకు అవసరమైన విధి విధానాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. పొదుపు సంఘాల ఆర్థిక బలోపేతంలో కీలకంగా వ్యవహరిస్తున్న వీవోఏలు తక్కువ వేతనంతో సేవలను అందిస్తున్నట్లు గుర్తించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంతో భద్రాద్రి జిల్లాలో 981, ఖమ్మం జిల్లాలో 1,040 మంది వీవోఏలకు లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వీవోఏలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పొదుపు సంఘాలకు సహాయకుల అవసరాన్ని గుర్తించిన సమైక్య పాలకులు వీవోఏలను నియమించారు. వారికి కనీస వేతనం ఇవ్వకుండానే తమ పరిధిలోని పొదుపు సంఘాల నుంచి రూ.2 వేల గౌరవ వేతనం తీసుకోవచ్చని చెబుతూ వదిలేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో మొదటిసారి వీవోఏల సేవలను గుర్తించింది. రూ.3 వేల వేతనం ప్రకటించింది. ఆ తర్వాత 2021లో మూల వేతనంపై 30 శాతం పీఆర్సీ పెంచడంతో వారి వేతనం రూ.3,900కి పెరిగింది. సంఘాల నుంచి వీవోఏలు తీసుకునే రూ.2 వేలతో కలిపి మొత్తం వేతనం రూ.5,900 అయింది. ఇంత తక్కువ వేతనంలో వేతనంతో పనిచేస్తున్నారని ఆలోచించిన సీఎం కేసీఆర్ తాజాగా ప్రభుత్వ మద్దతును ఇంకో రూ.1,100కి పెంచారు. దీంతో వారి గౌరవ వేతనమే రూ.5,000 అయింది. అలాగే వారు సంఘాల నుంచి తీసుకునే రూ.2,000ను రూ.3,000 పెంచుకునేందుకు అనుమతించారు. దీంతో మొత్తం కలిపి వీవోఏల వేతనం రూ.8,000కి పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నారు.
గౌరవ వేతనం పెంపుతో భద్రాద్రి జిల్లాలో 981, ఖమ్మం జిల్లాలో 1,040 మంది వీవోఏలకు లబ్ధి చేకూరనుంది. అలాగే, వీవోఏల ఇతర సమస్యల పరిష్కారానికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. యూనిఫాంకు నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారు. గతంలో 3 నెలలకు ఉన్న రెన్యూవల్ విధానాన్ని ఏడాదికి పెంచారు. వీవోఏలకు బీమా సౌకర్యం అందించడానికి నిర్ణయించారు. దీనిపై విధి విధానాల అధ్యయనానికి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించారు. ఇదే విషయాన్ని వేతనం పెంపు జీవో ప్రతిని గురువారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేస్తూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన తమకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్ల కనీస గౌరవం, ఆర్థిక భరోసా లభిస్తున్నాయని వీవోఏల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మా కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ జీతాలు పెంచడం సంతోషంగా ఉంది. ఈ ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయించడం, సభ్యులతో చెల్లింపులు, సభ్యుల రుణాలు సద్వినియోగం చేసుకునేలా సూచనలు ఇవ్వడం వంటి పనులు చేస్తున్నాం. మా పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
-జ్యోతి, వీవోఏ, కుప్పెనగుంట్ల
మా స్థాయిలో మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి, సంఘాల అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నాం. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం గౌరవించడం, వేతనం పెంపు ప్రకటన చేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు పాటిస్తూ ఏ పిలుపుకైనా తక్షణమే స్పందిస్తున్నాం. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ జీతం పెంచడం మా పనికి గౌరవం దక్కినట్లుగా భావిస్తున్నాం.
-వెలివెల జయలక్ష్మి, వీవోఏ, పెనుబల్లి
2007 నుంచి వీవోఏ వ్యవస్థ ఉంది. కానీ.. మమ్మల్ని గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా వేతనాలు వందల నుంచి వేలకు పెరిగాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒకేసారి రూ.1,100 పెంచారు. దీంతో మాకు గౌరవ వేతనం ప్రస్తుతం రూ.5వేలు అయింది. మొత్తం రూ.8వేలు అందుకోవడం అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది.
-పర్సా కృష్ణయ్య, వీవోఏ, తాళ్లపెంట
వీవోఏ పోస్టుకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాం. కానీ.. 2007 నుంచి 2014 వరకు మా వేతనం రూ.250 ఉండేది. మా జీతాలు, కష్టాల గురించి గత పాలకులు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా కష్టాన్ని గుర్తించి వివిధ రకాలుగా రూ.8వేల వరకు జీతం పెంచడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
-లీలా, వీవోఏ, పెనుబల్లి
తెలంగాణ రాష్ట్రంలో మా సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016లో గౌరవ వేతనాన్ని రూ.3వేలు ప్రకటించారు. పెరిగిన పీఆర్సీకి అనుగుణంగా 30 శాతం వేతనం పెంచారు. పొదుపు సంఘాల నుంచి రూ.2వేలతోపాటు గౌరవ వేతనం రూ.1,100 పెంచడమే కాకుండా పొదుపు సంఘాల నుంచి మళ్లీ రూ.3వేలు తీసుకోవచ్చని అనుమతించడంతో వేతనం రూ.8వేలు అందనుంది.
ఎస్కే.షహీనా, వీవోఏల సంఘం మండల కార్యదర్శి, అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము అందిస్తున్న సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ కనీస గౌరవ వేతనం అందిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో మా గౌరవం పెరిగింది. అలాగే పొదుపు సంఘాల నుంచి రూ.3వేలు తీసుకోవచ్చని అనుమతిచ్చింది. గౌరవ వేతనం రూ.5వేలు ఇవ్వడంతో మొత్తం వేతనం రూ.8వేలు అయ్యింది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-శివకుమారి, వీవోఏ, అశ్వారావుపేట
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 1: ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షాబంధన్ కానుకగా వీవోఏలకు గౌరవవేతనం పెంచడం పట్ల వీవోఏలు హర్షంవ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం అనుబంధ వీవోఏల సంఘం మండల అధ్యక్షురాలు చప్పిడి సుగుణమ్మ, ప్రధాన కార్యదర్శి గడ్డమీద వెంకట్రావమ్మ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి కొమరబత్తిని విజయకుమారి, ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, సంఘం గౌరవ సలహాదారు హెచ్ వెంకటలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు ఎం రాధ, సహాయ కార్యదర్శి పీ స్రవంతి, ఉపాధ్యక్షురాలు యాకలక్ష్మి, స్వరూప, రేణుక, లక్ష్మి, జీ హేమలత, జ్యోతి, సరస్వతి పాల్గొన్నారు.