సత్తుపల్లి టౌన్, జూలై 16: సీతారామ ప్రాజెక్టు రూపకర్త తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీయారేనని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మిగిలిన 10 శాతం పూర్తి చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని విమర్శించారు. కానీ.. కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాత్రం.. పైకి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
కానీ, ఏ ప్రభుత్వం ఏమి చేసిందో రైతులకు పూర్తిగా తెలుసని అన్నారు. కల్లూరులో గురువారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాను దిగజార్చి అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉన్న వనరులను వినియోగించుకోవడం చేతగాక బీఆర్ఎస్పై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రాష్ట్ర రైతుల కోసమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారని వివరించారు.
కల్లూరు పాత ఆయకట్టుకు సీతారామ నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా, ఇంకా ఏ త్యాగానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు పాలేపు రామారావు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, పేడకంటి రామకృష్ణ, ఇస్మాయిల్, వేము కృష్ణ, పోరు శ్రీనివాసరావు, జీ.శ్రీనివాసరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, కొరకుప్పల ప్రసాద్, మేకల కృష్ణ, రావుఫ్, ఇతిహాస్, కమ్లి, రాసమల్ల నాగేశ్వరరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.