నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడవాడలా గులాబీజెండా రెపరెపలాడింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొని కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. పల్లెల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. గ్రామగ్రామాన పార్టీ దిమ్మెలను గులాబీ రంగుతో ముస్తాబు చేసి బీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కేటీఆర్’ నినాదాలు మోరుమోగాయి.
ఖమ్మం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం గులాబీ జెండాను ఎగురవేసి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన స్వరాష్ర్టాన్ని సాధించిపెట్టిన ఏకైక పార్టీ ఆనాటి టీఆర్ఎస్.. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు దిండిగల రాజేందర్ పార్టీ జెండాను ఎగురవేయగా.. పాల్వంచలోని తన స్వగృహంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ సర్కారేనని అందరికీ తెలిసిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిందన్నారు.

పాల్వంచ: కేక్ కట్ చేస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తున్న దిండిగల రాజేందర్, పార్టీ శ్రేణులు

ఖమ్మంలో జెండా పండుగలో పాల్గొన్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో జరిగిన వేడుకలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు

అశ్వారావుపేట: తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేస్తున్న బీఆర్ఎస్ నాయకులు